కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు : చంద్రబాబునాయుడు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఇటీవల తనపై అసభ్యంగా మాట్లాడారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. తన వద్ద మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇష్టానుసారంగా మాట్లాడినా తాను ప్రజల కోసమే భరిస్తున్నానని చంద్రబాబు అన్నారు. పేదరికం లేని సమాజం చూడాలనేది తన జీవితాశయమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కేంద్ర సంస్థలను ఇవ్వలేదని, ద్రవ్యలోటును పూడ్చలేదని మండిపడ్డారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధుల్ని సైతం వెనక్కి తీసుకున్నారని దుయ్యబట్టారు. కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టమంటే, పెట్టమనే విధంగా కేంద్రం మాట్లాడితే తామే సాహసం చేసి పరిశ్రమను పెట్టుకొనేందుకు సిద్ధపడ్డామని చంద్రబాబు తెలిపారు. విశాఖ రైల్వేజోన్, దుగరాజపట్నం పోర్టు… ఇలా విభజన చట్టంలో పేర్కొన్న ఏ పనీ కేంద్రం చేయడంలేదని సీఎం దుయ్యబట్టారు.













