పెట్టుబడులకు ఎపి అన్ని విధాల అనుకూలం : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు అన్నీ విధాల అనుకూలమైన రాష్ట్రమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. కేవలం పెట్టుబడులు, సాంకేతికత, వనరులతో రాష్ట్రానికి రండి. అనుమతులు మొదలు భూకేటాయింపుల వరకు అన్నీ నేను చూసుకుంటాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామి ఇచ్చారు. ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు మూడు రోజులపాటు విశాఖలో కేంద్ర వాణిజ్య శాఖ, కానోడేరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) సహకారంతో పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు జరగనుంది.
ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో సన్నాహక సదస్సును నిర్వహించారు. ఇందులో వివిధ దేశాలకు చెందిన రాయబారులు, దౌత్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. గత మూడేళ్లలో దేశంలో కేవలం ఏపీ మాత్రమే రెండంకెల వద్ధి సాధించిందని అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం 15 శాతం వద్ధి సాధిస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. సులభతర వ్యాపార నిర్వహణలో ప్రపంచంలోనే మొదటి ఐదు స్థానాల్లో ఏపీని నిలబెట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. ఏపీలో అపారమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని, వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం, గుజరాత్ తర్వాత అత్యధికంగా కార్గోని హ్యాండిల్ చేసే సామర్థ్యం రాష్ట్రం సొంతమని అన్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థికంగా ఆటుపోట్లను ఎదుర్కొంటున్న రాష్ట్రంలో ప్రతి సంక్షోభాన్ని ఓ అవకాశంగా మార్చుకుని ముందుకు వెళుతున్నామని సీఎం పేర్కొన్నారు. ‘ఇప్పుడు రాష్ట్రాన్ని సందర్శించండి. మళ్లీ మూడు నాలుగేళ్ల తర్వాత వచ్చి చూడంండి. అప్పుడు మీకు అభివద్ధిలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది.’ అని సీఎం పారిశ్రామికవేత్తలకు సూచించారు. రాష్ట్రంలో నైపుణ్యాలు ఉన్న కార్మికులు ఉన్నారని, శాంతి భద్రతల సమస్యలు లేవని అందుకే ఇక్కడ వ్యాపారం ప్రారంభిస్తే లాభాల పంట పండుతుందన్నారు. ‘రాష్ట్రంలో కాలుష్యం లేదు. అందుకే ఇక్కడ జీవిస్తే ఆయుష్షు మరో 10 ఏళ్లు పెరుగుతుంది’ అని సీఎం తెలిపారు.













