AP Cabinet: మహానాడు తర్వాత ఏపీ మంత్రి వర్గ విస్తరణ..!?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం (NDA Govt) అధికారంలోకి వచ్చి 10 నెలలైంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా (CM Chandrababu) ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే దాదాపు అన్ని కేబినెట్ బెర్త్ లను పూర్తి చేశారు. అయితే ఒక్క ఖాళీ మాత్రం అలాగే ఉంచారు. దీంతో ఆ ఒక్క పోస్టు కోసం చాలా మంది ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే దాన్ని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సోదరుడు నాగబాబుకు (Naga Babu) కేటాయిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అయితే ఇప్పటివరకూ అది కూడా జరగలేదు. దీంతో మంత్రివర్గ విస్తరణ (cabinet expansion) ఉంటుందా.. ఉండదా అనే అనుమానాలు తలెత్తాయి. అయితే మహానాడు తర్వాత కేబినెట్ ను విస్తరించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
మంత్రుల పనితీరును అంచనా వేసేందుకు కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చి పది నెలలు మాత్రమే అయింది. అప్పుడే కొందరు మంత్రుల పనితీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. వాళ్లను తప్పించి కొత్త వాళ్లకు అవకాశం కల్పించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబుకు అలాంటి ఆలోచన ఏదీ లేదని పార్టీ విశ్వసనీయ వర్గాలు చెప్తున్న సమాచారం. ఉన్న ఒక ఖాళీని నాగబాబుకు ఇచ్చేందుకు ఇప్పటికే అంగీకారం కుదిరిందని, ఆ మేరకు ఆ ఖాళీని భర్తీ చేస్తారని చెప్తున్నారు.
అయితే ఇప్పుడున్న మంత్రుల్లో కొందరి శాఖలను మార్చే అవకాశం ఉందని సమాచారం. కొంతమంది మంత్రులు తమ పేషీల్లో అవినీతి అధికారులను పెట్టుకోవడం, శాఖాపరంగా కొందరు అవినీతికి పాల్పడుతుండడం ముఖ్యమంత్రి పేషీ దృష్టికి వచ్చింది. అందుకే అలాంటి మంత్రుల శాఖలను మార్చడం ద్వారా వాటికి అడ్డుకట్ట వేయాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ నుంచి వచ్చిన కొందరు శాఖలతో పాటు రాయలసీమకు చెందిన ఓ మంత్రి శాఖను కూడా మార్చే అవకాశం ఉన్నట్టు అంచనా. అలాగే నాగబాబుకు ఇప్పటికే జనసేన మంత్రులు నిర్వహిస్తున్న వాటిలో ఓ శాఖను కట్టబెడతారని తెలుస్తోంది.
నాగబాబు ఎమ్మెల్సీ అవగానే మంత్రివర్గంలోకి తీసుకుంటారని అందరూ అనుకున్నారు. అయితే అమరావతి రీలాంచింగ్ పనుల్లో రాష్ట్ర యంత్రాంగం మొత్తం బిజీగా ఉంది. మే 2న జరిగే ప్రధాని సమావేశాన్ని కూటమి పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దాన్ని ఘన విజయం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆ తర్వాత మే నెలాఖరులో టీడీపీ మహానాడు ఉంది. కడపలో జరిగే ఈ మహానాడును సూపర్ సక్సెస్ చేయాలనుకుంటోంది. అందుకే మే నెలలో ఇంకే పనులు పెట్టుకోవట్లేదు. జూన్ నెల 12కు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుంది. ఆ సందర్భంగా మంత్రి వర్గాన్ని విస్తరించడంతో పాటు శాఖల్లో మార్పులు, చేర్పులు చేసేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారు.