ఏపీ ఎలక్షన్ హీట్ పై 150 పేజీల సిట్ నివేదిక..
గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఆంధ్రాలో పోల్ హింస చెలరేగింది. ఏపీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను ఈ హింసాత్మక ఘటనలు దారుణంగా దెబ్బతీశాయి. భద్రత కల్పించడంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో విఫలమైంది అన్న ఆరోపణలు పెద్ద ఎత్తున రావడంతో..ఈ విషయాన్ని ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకుంది. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం సిట్ ను ఏర్పాటు చేసి.. పెద్ద ఎత్తున దర్యాప్తులు జరపడంతో పాటు పలువురు ఉన్నతాధికారులను సస్పెండ్ చేసింది. మరి కొంతమందికి బదిలీ వేటు పడింది. సిట్ బృందం హై టెన్షన్ ఏరియాస్ ను పరిశీలించి తన నివేదికను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందజేశారు.
ఆంధ్రాలో ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై సిట్ తన 150 పేజీల నివేదికను సమర్పించింది. హింస జరిగిన ప్రాంతాలలో పర్యటించిన సిట్ టీంకు పలువురు బాధితులు తమకు జరిగిన అన్యాయం గురించి కంప్లైంట్ లు ఇచ్చారు. వాటిని పరిశీలించి.. వినతి పత్రాలకు సంబంధించిన ఘటనలలో కేసు నమోదు కానట్లయితే వీటి ఆధారంగా కొత్త ఎఫ్ఐఆర్లను కూడా నమోదు చేయబోతున్నారు. సిట్ నివేదన ఇచ్చిన నేపథ్యంలో సెట్ టీంను కోఆర్డినేట్ చేసుకొని కేసుకు సంబంధించిన దర్యాప్తులను పూర్తి చేయాల్సిందిగా ఆయా జిల్లాల ఎస్పీలు.. రేంజ్ డీఐజీలతో పాటు గుంటూరు ఐజీకి కూడా ఆదేశాలు జారీ అయ్యాయి.
ఎన్నికల సందర్భంగా హింస చెలరేగిన జిల్లాలలో మొదటి స్థానంలో పలనాడు నిలిచింది. జిల్లా పరిధిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు.. నరసరావుపేట, మాచర్ల, గురజాల ప్రాంతాలలో హింసాత్మక సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. ఇక్కడ జరిగిన దాడులలో ఎందరో అమాయకులు గాయాలపాలయ్యారు. పల్నాడు జిల్లాలో అత్యధికంగా నరసరావుపేటలో 10 కేసులు నమోదయ్యాయి. మాచర్లలో 8 కేసులు నమోదు కాగా.. మొత్తం నిందితుల సంఖ్య 296 కు చేరుకుంది. అనంతపురం జిల్లా విషయానికి వస్తే.. తాడిపత్రి నియోజకవర్గంలో ఎన్నికల అనంతరం హింస విపరీతంగా చెలరేగింది. ఈ జిల్లాకు సంబంధించి నమోదైన 7 కేసులకు గాను 728 మంది నిందితులు ఉండడం విశేషం. ఇందులో 296 మందిని గుర్తించగా 91 మందిని అరెస్టు చేయడం జరిగింది.. ఇంకా 332 మందిని గుర్తించాల్సి ఉంది. లెక్క ప్రకారం ఇంకా అనంతపురం జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో అరెస్టు కావలసిన వారి సంఖ్య మరో 634 ఉన్నట్లుగా సిట్ నివేదిక స్పష్టం చేస్తోంది.
మరోపక్క చంద్రగిరి, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో చోటు చేసుకున్న హింసకు సంబంధించి ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయి. ఇందులో 61 మంది నిందితులుగా గుర్తించడం జరిగింది. అయితే కేవలం 14 మందిని మాత్రమే అరెస్టు చేశారు. ఇప్పటికీ పద్మావతి మహిళా యూనివర్సిటీ పరిధిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు జూన్ 4 ఓట్ల లెక్కింపు సమయంలో ఇక్కడ మరింత హింసాత్మక సంఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉంది అన్న టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం ఈ జిల్లాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. మే 13న జరిగిన సంఘటనలు ఎట్టి పరిస్థితుల్లో జూన్ 4న పునరావృతం కాకుండా చూసుకోవడానికి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.













