కరోనా కారణంగా ఒంటిపూట బడులు …ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ఆంధప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒంటిపూట బడులు ఉంటాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమలవుతుందని చెప్పారు. ఉదయం 7:45 నుంచి 12:30 వరకు తరగతుల అనంతరం మధ్యాహ్న భోజనం యథావిధిగా ఉంటుందని పేర్కొన్నారు. కరోనా కేసులు, ఎండల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పాఠశాల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహణ, మాస్క్లు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.













