సంతోష సూచీలో భారత్ కంటే ఏపి స్కోరే ఎక్కువ
దేశ సగటు కంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రజలే సంతోషంగా ఉన్నారని ప్రపంచ సంతోష సూచి నివేదిక తేల్చింది. సంతోష సూచీలో భారత్కు వచ్చిన పాయింట్ల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక పాయింట్లు వచ్చాయి. చైనా, పాకిస్థాన్, భూటాన్, నేపాల్ తదితర దేశాల కంటే కూడా రాష్ట్రం సంతోష సూచిలో ముందుంది. అదేవిధంగా రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా ప్రజలు అందరి కంటే ఎక్కువగా సంతోషంగా ఉండగా, ప్రకాశం జిల్లా వాసులు సంతోషంగా ఉండటంలో చివరి స్థానానికి పరిమితమయ్యారు.
ఐక్యరాజ్యసమతి ఆధ్వర్యంలో సుస్థిర అభివృద్ధి పరిష్కారాల వేదిక 2012 నుంచి ఏటా వివిధ దేశాల్లో సంతోష స్థాయిని అంచనా వేసి, ఆ వివరాలతో ప్రపంచ సంతోష సూచీని ప్రకటిస్తోంది. ఈ ఏడాది 155 దేశాల్లో సర్వే నిర్వహించగా మన దేశం 122వ స్థానంలో నిలిచింది. పాకిస్థాన్(80), భూటాన్ (97), నేపాల్(99), బంగ్లాదేశ్(110), శ్రీలంక (120) మన దేశం కంటే ముందంజలో ఉన్నాయి. కానీ ఆ దేశాల కంటే ఆంధ్రప్రదేశ్ ముందుంది. రాష్ట్రం సాధించిన హ్యాపీనెస్ సోర్కు 5,368. అదే సమయంలో భారత్ స్కోరు 4,315 మాత్రమే. ప్రపంచ స్థాయిలో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ స్కోర్ 72వ ర్యాంకుతో సమానం. 5,273 పాయింట్లు సాధించిన చైనాను, 5,269 స్కోరు సాధించిన పాకిస్థాన్నూ రాష్ట్రం అధిగమించింది. మన దేశం సాధించిన ర్యాంకుతో పోల్చినప్పుడు జాతీయ స్థాయిలో తళుక్కుమనడే కాకుండా, ఎక్కువ సంతోష సూచికల సోర్కు సంపాదించి మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.













