డిప్యూటీ కలెక్టర్ గా పి.వి. సింధు
బాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధును రాష్ట్ర రెవెన్యూశాఖ, భూ పరిపాలన విభాగంలో డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల కాపీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందజేశారు. వెలగడపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సింధు తన తల్లిదండ్రులతో వచ్చిన చంద్రబాబునాయుడిని కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సింధు భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. రియో ఒలంపిక్స్‌లో రజిత పతకం సాధించిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సింధూకి అమరావతి రాజధాని నివాస ప్రాంతంలో 1000 గజాల నివాస స్థలం, రూ.3కోట్లు నగదు బహుమతి, అలాగే సింధూ కోరుతున్న విధంగా గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామని ప్రకటించిన విధంగా ఆమె నియామకపు ఉత్తర్వులు అందచేశారు. గతంలో రూ.3 కోట్ల నగదు బహుమతికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు. తాజాగా గత వారం సిఆర్డిఎ పరిధిలో 1000 గజలా నివాస స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ముఖ్యమంత్రి సృష్టం చేశారు. తెలుగువారి కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయిలో ఎగురవేసిన తెలుగింటి ఆడపడుచు పి.వి.సింధు అని ఆయన కొనియాడారు. గ్రూప్-1 అధికారిణిగా రాష్ట్రంలోని క్రీడాభివృద్ధికి సేవలు అందించాలని సూచించారు. సింధుకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆశీర్వదించారు.













