అది ఎప్పటినుంచో ఉందని.. ఇవాళ కొత్తగా రాలేదు : మంత్రి బొత్స
ఆస్తి పన్ను వసూలు కోసం ఓ మున్సిపల్ కార్పొరేషన్ బ్యానర్ ఏర్పాటు చేసిందని, అందులో తప్పేముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పన్నులు కట్టకపోతే స్థానిక సంస్థలు ఎలా బలోపేతం అవుతాయని ప్రశ్నించారు. పన్నులు కట్టకపోతే ఆస్తులు జప్తు చేయడం అనేది ఎప్పటినుంచో ఉందని, ఇవాళ కొత్తగా రాలేదని పేర్కొన్నారు. బలవంతపు వసూళ్లు తమ ప్రభుత్వం విధానం కాదని స్పష్టం చేశారు. పన్నులు కట్టలేదని ఇంటికి తాళం వేయమని అధికారులకు ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదన్నారు. అయితే కొంత మంది అధికారులు ఇలా చేశారని తన దృష్టికి వచ్చిందని, అసలు ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకుంటున్నట్లు తెలిపారు. అవసరమైతే అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.













