రెడ్ జోన్ల కే లాక్డౌన్ పరిమితం చేయాలి : వైఎస్ జగన్
ఆంధప్రదేశ్‌లో రెడ్ జోన్ల వరకే లాక్డౌన్ పరిమితం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 676 మండలాల్లో 81 మండలాలను కరోనా ప్రభావిత మండలాలుగా గుర్తించామని జగన్ తెలిపారు. ఇందులో 37 రెడ్జోన్లు, 44 ఆరెంజ్ జోన్లు ఉన్నాయని చెప్పారు. 595 మండలాలు గ్రీన్ జోన్లో ఉన్నాయని తెలిపారు. కరోనా ప్రభావం ప్రస్తుతానికి గ్రీన్‌జోన్ లో లేదన్నారు.
కరోనా ప్రభావం ఉన్న 81 మండల్లాలోనే లాక్డౌన్ విధించాలని సీఎం జగన్ ప్రధానిని కోరారు. జనం గుమిగూడకుండా నియంత్రణ చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. సినిమా హాళ్లు, మాల్స్, పాఠశాలలు యథావిథిగా మూసివేయెచ్చని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో లాక్డౌన్ ఆంక్షలు సవరించాలని, అర్బన్ ప్రాంతాల్లో మాత్రం లాక్డౌన్ ఆంక్షలు కొనసాగించాలని విన్నవించారు. ప్రధానిగా మీరు తీసుకునే ఏ నిర్ణయంపైనా కట్టుబడి ఉంటామని, మీరు సూచించే వ్యూహాన్ని అమలు చేస్తామని జగన్ తెలిపారు.













