ఆనందయ్య మందు పై …హైకోర్టులో

నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య కరోనా చుక్కల మందుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆనందయ్య చుక్కుల మందుకు సంబంధించిన నివేదిక అందిందని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మందు హానికరం కాదని, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినవారిని అక్కడికి తీసుకొస్తే ప్రమాదమని ప్రభుత్వ తరపున న్యాయవాది వాదించారు. ఈ ఔషధం ప్యాకింగ్, నిల్వకు నెల నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వం కోర్టుకు వివరించింది. ఇందువల్ల మూడు నెలల తర్వాత పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. తాము దీనిని నిర్వహించలేమని ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. తమ వాదనలను రికార్డ్ చేయాలని హైకోర్టు ధర్మసనానికి విజ్ఞప్తి చేశారు.
మందువల్ల హానిలేదని చెప్తూ వేయటానికి అభ్యంతరం ఏమిటని న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలను ఆనందయ్య తరపు న్యాయవాది అశ్వనీకుమార్, పిల్ వేసిన న్యాయవాది వ్యతిరేకించారు. మందుకు అనుమతిస్తూనే ప్రభుత్వం ఇలా వ్యవహరించటం మంచిది కాదని న్యాయవాదులు తెలిపారు. ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగించే మందు వేసేందుకు అభ్యంతరం ఏమిటని న్యాయవాదులు ప్రశ్నించారు. ప్రాణాలు పోతాయేనే ఉద్దేశంతోనే కంటిలో మందు కోసం అక్కడికి వస్తారని న్యాయవాదులు ధర్మాసనానికి చెప్పారు. కోర్టు ముగిసిన తర్వాత ఆర్డర్ ఇస్తామని ధర్మాసనం చెప్పింది.