అంతర్జాతీయ బౌద్ధ విశేషాల ప్రదర్శనలో ‘అమరావతి’
అమెరికా, ఐరోపా దేశాల్లో త్వరలో జరగనున్న అంతర్జాతీయ బౌద్ధ విశేషాల ప్రదర్శనలో ‘అమరావతి, ఆంధ్రదేశం’ అంశాలపై ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేయనున్నారు. ‘మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్’ ఆవిర్భవించి 150 ఏళ్లు పూర్తికావడాన్ని పురస్కరించుకుని ఈ ప్రదర్శనను నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ఆసియా ప్రతినిధి జాన్‌గయ్ తెలిపారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్‌తో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మ్యూజియాల్లోని అమరావతి, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన బౌద్ధ సంబంధిత విశేషాలు, కళాఖండాలు, చారిత్రక వస్తువులన్నింటినీ సమీకరించి, ఈ అంతర్జాతీయ ప్రదర్శనలో ఉంచబోతున్నట్లు జాన్ గయ్ చెప్పారు. ఈ కార్యక్రమానికి సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమని పరకాల చెప్పారు.













