మెడికల్ హబ్‌గా అమరావతి
నవ్యాంధ్ర రాజధాని అమరావతి మెడికల్ హబ్‌గా రూపాంతరం చెందుతోంది. రాజధాని పరిసర ప్రాంతాల్లో తమ ఆసుపత్రులు నెలకొల్పేందుకు పలు కార్పొరేట్ వైద్య సంస్థలు ముందుకు వస్తున్నాయి. మరోవైపు రాజధాని అమరావతి సమీపంలో మంగళగిరిలో ఆల్ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 247 ఎకరాల విస్తీర్ణంలో రూ.1618 కోట్లతో ఎయిమ్స్‌ను నిర్మిస్తున్నారు. మొత్తం 960 పడకలతో నిర్మితమవుతున్న ఈ అత్యాధునిక ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య నిపుణులు అందుబాటులులో ఉండనున్నారు. అదేవిధంగా వైద్య, శస్త్ర చికిత్సలకు సంబంధించిన స్పెషలిస్టులను నియమించనున్నారు. దీనికి అనుగుణంగా వైద్య కళాశాలలను కూడా ఏర్పాటు చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తాత్కాలికంగా విజయవాడ కేంద్రంగా ఈ కళాశాలను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.













