మేం లేకుంటే గెలుస్తురా?- అఖిలప్రియ వర్సెస్ ఆదినారాయణరెడ్డి
నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ తన గెలుపు కోసం అసాధారణ రీతిలో బలాన్ని ప్రయోగించింది. 10 మంది మంత్రులు రెండునెలల పాటు అక్కడే తిష్టవేశారు. 200కోట్లను జనం మీదకు వెదజల్లారు. ఇవన్నీ జగమెరిగిన సత్యాలే. ఇప్పుడు మంత్రులు అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి మధ్య కొత్త వివాదానికి తెరలేచింది.
నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలన్న దానిపై ఇద్దరు మంత్రుల మధ్య చిచ్చు రాజుకుంది. తమ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న చోట తాము చెప్పినవారికే పదవి దక్కుతుందని అఖిలప్రియ చెబుతున్నారు.తమ అనుచరులే చైర్మన్ కావాలని శీలం భాస్కర్ రెడ్డి, మునగాల లక్ష్మీకాంతరెడ్డి పేర్లను అఖిలప్రియ సిఫార్సు చేశారు. ఇంతలో ఆదినారయణరెడ్డి తన అనుచరుల పేర్లను తెరపైకి తెచ్చారు. కానాల గురునాథ్ రెడ్డికి చైర్మన్ పదవి ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు.
నంద్యాల ఉప ఎన్నికల సమయంలో గురునాథ రెడ్డికి తాను హామీ ఇచ్చానని ఆదినారాయణరెడ్డి చెబుతున్నారు. నంద్యాల నియోజకవర్గంలోకి ఆదినారాయణరెడ్డి వేలు పెట్టడం ఏమిటని భూమా వర్గం మండిపడుతుంది. ఇందుకు ఆదినారాయణరెడ్డి వైపు నుంచి కూడా గట్టి సమాధానమే వస్తోంది. రెండు నెలల పాటు నంద్యాలలో వీధివీధి తిరిగి ఓటర్లను టీడీపీ వైపు తిప్పుకున్నామని.. అప్పుడు ఎవరూ తమను నాన్ లోకల్ అనేదు కదా అని ప్రశ్నిస్తున్నారు.
అసలు తాము నంద్యాలకు వచ్చి పనిచేసి ఉండకపోతే భూమా కుటుంబం గెలిచేదా అన్నది ఆదినారాయణరెడ్డి వర్గం కౌంటర్. కాబట్టి నియోజకవర్గం నంద్యాల అయినా సరే ఆదినారాయణరెడ్డి తాను చెప్పిన వ్యక్తికే మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అటు ఎమ్మెల్సీ ఫరూక్ కూడా తన అనుచరుల పేర్లను సిఫ్పార్సు చేస్తున్నారు. మొత్తం మీద తన నియోజకవర్గం కానప్పటికి నంద్యాలపై ఆదినారాయణరెడ్డి ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నించడాన్ని భూమా వర్గీయులు జీర్ణించుకోలేకపోయారు.













