పవన్ ‘పదేళ్ల పొత్తు’ వ్యూహం..
జనసేనాని పవన్ కల్యాణ్… ఫ్యాన్ స్విచ్ఛాప్ చేయాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రాన్ని సీఎం జగన్ భ్రష్టుపట్టించారని.. తమనేతలను తీవ్రంగా వేధించారని.. అలాంటి వ్యక్తి తిరిగి సీఎం కానివ్వనని ప్రతినబూనారు. అందులో భాగంగా టీడీపీతో పొత్తుతో ముందుకెళ్తున్నారు. అంతేకాదు.. వైసీపీని గద్దెదించే క్రమంలో ఎలాంటి త్యాగానికైనా సిద్ధమంటున్నారు. తమతో పొత్తులో ఉన్న టీడీపీని పల్లెత్తు మాట అనొద్దని.. అలా అన్నవారిని కోవర్టులుగా చూస్తానని హెచ్చరించారు. అలాంటి వారు నా పార్టీలో అక్కర్లేదు! బయటికి వెళ్లిపోవచ్చని తేల్చేశారు…
అంతేకాదు.. టికెట్ల విషయంలోనూ పవన్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. టికెట్ల కేటాయింపు విషయంలోనూ ఇచ్చిపుచ్చుకునేలా ఉండాలన్నదే పవన్ అభిమతంగా ఉంది. మొన్నటి వరకూ సీఎం పదవి ఇస్తే స్వీకరిస్తా అన్న పవన్…. ఇటీవలి కాలంలో ముందు గెలుద్దాం.. తర్వాత పదవి సంగతి ఆలోచిద్దామంటూ శ్రేణులకు సూచిస్తున్నారు. మనం కనీస సీట్లు గెలవకుండా సీఎం ఇవ్వమంటే.. ఎవరిస్తారని వారినే తిరిగి ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో పార్టీ చేసిన పవన్ పార్టీకి నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో పవన్ చేయి పట్టుకుని తిరిగిన బీజేపీ సైతం… తాము పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తేల్చేసింది. ఇక మిగిలిన పార్టీలు సైతం.. పవన్ ను ఏపీ నేతగానే భావిస్తున్నాయి. ఆఖరుకు పవన్ అభిమానులు సైతం.. సినిమాలకు ఎగబడుతున్నారు తప్ప.. ఓట్ల విషయంలో మాత్రం వేయడం లేదు. తమకు నచ్చిన పార్టీ, నేతకే గుద్దేస్తున్నారు. ఇదే విషయం పవన్ ను తీవ్రంగా వేధిస్తోంది. మరో పదేళ్లు టీడీపీతో పొత్తు ఉండాలని పవన్ చేసిన వ్యాఖ్యలు.. సైతం దీనికి అద్దం పడుతున్నాయి..
వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించే లక్ష్యంతో ఈ పొత్తును కొంసాగిస్తున్నారు అధినేత పవన్ కల్యాణ్. అయితే బీజేపీతో పొత్తు ను పవన్ లైట్ తీసుకుంటున్నప్పటికీ టీడీపీతో మాత్రం పొత్తును పక్కా ప్రణాళిక బద్దంగా కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించాలంటే టీడీపీకి జనసేన అవసరం చాలానే ఉంది. గతంతో పోల్చితే జనసేన పార్టీ బలం పెంచుకోవడంతో ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటు శాతం కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జనసేన టీడీపీకి తొడవ్వడం వల్ల వైసీపీకి గట్టిగానే పోటీనిచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే టీడీపీ జనసేన కూటమి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.













