Nagababu: చిరంజీవి, పవన్ తర్వాత నాగబాబు .. ముగ్గురు అన్నదమ్ములు చట్ట సభల్లో అరుదైన రికార్డు..

జనసేన (Janasena) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మెగా బ్రదర్ (Mega Brother) నాగబాబు (Naga Babu) తాజాగా ఎమ్మెల్సీగా రాష్ట్ర పెద్దల సభలో అడుగుపెట్టారు. మార్చి నెలలో జరిగిన ఎన్నికల్లో జనసేన కోటాలో గెలుపొందిన ఆయనకు ఇది తొలి శాసన అనుభవం. బడ్జెట్ సమావేశాలు అప్పటికి పూర్తవడంతో వర్షాకాల సమావేశాలు ఆయనకి మొదటి సభలుగా మారాయి. సభలో ప్రవేశించే ముందు తన సోదరుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను కలసి మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తీసుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. సభలోకి వచ్చిన వెంటనే ఆయనకు కూటమి ఎమ్మెల్సీలు, ఇతర సభ్యులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
మొదటి రోజు నాగబాబు ప్రవర్తన అందరి దృష్టిని ఆకర్షించింది. ఎవరెవరూ ఏ అంశాలపై మాట్లాడుతున్నారో, వాటి వెనుక అర్థం ఏమిటో చాలా శ్రద్ధగా గమనించినట్లు కనిపించారు. ఆయన వెనుక వరుసల్లో కూర్చున్నప్పటికీ కూటమి ప్రతినిధిగా, జనసేనలో కీలక నేతగా ఉండటం వల్ల రాబోయే రోజుల్లో తన వాణి బలంగా వినిపిస్తారనే అభిప్రాయం కలిగింది.
నిజానికి నాగబాబు రాజకీయ ప్రయాణంపై గతంలోనే విస్తృత చర్చ జరిగింది. ఏడాది క్రితం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ ఆయనకు త్వరలోనే మంత్రి పదవి వస్తుందని స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఆ సమయంలోనే ఆయనకు ఏ మంత్రిత్వ శాఖలు దక్కవచ్చోనని మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా విస్తృతంగా ఊహాగానాలు చేసింది. అయితే అన్ని అంచనాలను పక్కనబెట్టి ఆయన మొదటగా ఎమ్మెల్సీ హోదాలో సభలోకి అడుగుపెట్టారు.
ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన సోదరుడి భవిష్యత్తు గురించి ప్రస్తావించారు. నాగబాబుకు ఏపీ మంత్రిత్వం కంటే ఆయనను రాజ్యసభ (Rajya Sabha)కు పంపించాలని తన మనసులో ఉందని చెప్పారు. 2026లో ఖాళీ కానున్న ఐదు రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు ఖాయం అని, అదే సీటు నాగబాబుకు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ఆయనకు కేంద్ర మంత్రిగా అవకాశాలు కల్పించాలని పవన్ ఆలోచిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
నాగబాబు చట్టసభలోకి రావడం మరో ప్రత్యేకతను సృష్టించింది. మెగా బ్రదర్స్ ముగ్గురూ ఇప్పుడు ప్రజా ప్రతినిధులుగా నిలిచారు. చిరంజీవి (Chiranjeevi) 2009లో తిరుపతి (Tirupati) నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ 2024లో పిఠాపురం (Pithapuram) నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీగా పెద్దల సభలో చేరడంతో ముగ్గురు అన్నదమ్ములు శాసనసభల్లో భాగస్వాములు కావడం అరుదైన రికార్డు అని చెప్పవచ్చు.