వైయస్ జగన్పై పుస్తకం ఆవిష్కరణ
‘‘అడుగడుగునా అంతరంగం’’ పుస్తకాన్ని ఆవిష్కరించిన వైయస్సార్సీపీ అధినేత
వైయస్ జగన్ రాజకీయ జీవితం, 14 నెలలపాటు ఆయన చేసిన ప్రజాసంకల్పయాత్ర విశేషాలతో సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరి రాసిన ‘‘అడుగడుగునా అంతరంగం’’ పుస్తకాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆవిష్కరించారు. వైయస్ జగన్ రాజకీయ జీవితంలో ముఖ్యమైన మైలురాళ్లు, అనూహ్య మలుపులను సీనియర్ జర్నలిస్ట్ శ్రీహరి ఈపుస్తకంలో చర్చించారు. 14 నెలలపాటు కొనసాగిన ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభం నుంచి చివరి వరకూ రచయిత శ్రీహరి కొనసాగారు. 268 పేజీల ఈ పుస్తకంలో పాదయాత్ర విశేషాలను పొందుపరిచారు. వైయస్సార్ మరణం తర్వాత వైయష్ జగన్ ఎదుర్కొన్న కఠిన పరిస్థితులు, సొంత పార్టీ స్థాపన, తన కాళ్లమీద తాను నిలబడ్డానికి చేసిన ప్రయత్నాలు, ఆసమయంలో తాను ఆ నిర్ణయాలు తీసుకోవడానికి దారితీసిన పరిస్థిలన్నింటినీ కూడా ఈ పుస్తకంలో విపులంగా చర్చించారు. అంతేకాదు వైయస్ జగన్ వ్యక్తిత్వం, రోజువారీ ఆయన దినచర్య తదితర విషయాలూ పుస్తకంలో ప్రముఖంగా కనిపిస్తాయి.
ప్రజాసంకల్పయాత్రలో ప్రజలతో మమేకం అయిన తీరు, ఆయన ప్రసంగాల తీరు, దానికి వచ్చిన స్పందన, వివిధ వర్గాలనుంచి కష్టనష్టాలు తెలుసుకున్న తీరు మొదలైన అంశాలకు పుస్తకంలో చోటు లభించింది.
పాదయాత్ర వేదికగా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని వైయస్ జగన్ నడిపిన తీరు, బీజేపీని వదిలి కాంగ్రెస్తో చేయి కలిపిన టీడీపీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్కళ్యాణ్ కోణాన్ని పుస్తకంలో పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరి రాసిన ఈపుస్తకాన్ని ఎన్.ఎం.ఆర్. మీడియా కమ్యూనికేషన్స్ తరఫున నారు మాధవరెడ్డి, నారు మహేశ్వర్రెడ్డి ముంద్రించారు.













