Posani: పోలీసులతో మాట్లాడేది ఇలాగేనా రాజా..?
కులాల మధ్య చిచ్చు పెట్టారనే కారణంతో నమోదైన కేసులో సినీ నటుడు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) అరెస్ట్ అయ్యారు. అన్నమయ్య జిల్లా (annamayya district) పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపి కోర్టులో హాజరు పరిచారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనకు బెయిల్ (bail) తీసుకొచ్చేందుకు వైసీపీ (YCP) తరపు న్యాయవాదులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే పోసాని కృష్ణమురళి తాను చేసింది తప్పేనని ఒప్పేసుకోవడం సంచలనం అనే చెప్పొచ్చు. రిమాండ్ రిపోర్టులో పోలీసులు ఈ విషయాన్ని స్పష్టంగా వెల్లడించారు. తప్పయిపోయింది రాజా అని పోసాని చెప్పినట్లు రాసుకొచ్చారు.
పోసాని కృష్ణమురళి ఎంతటి ఘటికుడో మనందరికీ తెలుసు. కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి వేసే రకం ఆయన. దేన్నయినా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో దిట్ట. ప్రత్యర్థులను టార్గెట్ చేశారంటే ఇక ఎదుటివారు కళ్లు, చెవులూ మూసుకోవాల్సిందే. అందుకే పోసాని జోలికి వెళ్లేందుకు ఎవరూ సాహసించరు. పోసాని మాటలు చూస్తే ఈయన మతి ఉండే ఇలా మాట్లాడుతున్నారా.. లేకుంటే పిచ్చి పట్టిందా అని అనుమానిస్తూ ఉంటారు. అందుకే ఈయన్ను మెంటల్ కృష్ణ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తి నేరాన్ని ఒప్పుకోవడం అంటే పెద్ద విషయమే.
అన్నమయ్య జిల్లా పోలీసులు పోసాని కృష్ణమురళిని దాదాపు 7 గంటల పాటు విచారించారు. మొదట్లో కాస్త బెట్టు చేసిన పోసాని.. ఆ తర్వాత దారికి వచ్చారు. తప్పయిపోయింది రాజా.. సారీ కూడా చెప్పాను రాజా.. అని పోలీసులతో చెప్పినట్లు రిమాండ్ రిపోర్టులో (remand report) పేర్కొన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) స్క్రిప్టు ఇస్తే అలా మాట్లాడేవాడినని.. సజ్జల భార్గవ్ రెడ్డి (Sajjala Bhargav Reddy) ఆ వీడియోలను వైరల్ చేసేవారని పోసాని అంగీకరించారు. ఇక ఫిల్మ్ డెవల్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ (Film Development Corporation Chairman) గా నెలకు రూ.3.83 లక్షల వరకూ జీతభత్యాలు లభించేవని చెప్పారు. ముఖ్యంగా కులాల మధ్య చిచ్చు పెట్టారనే ఆరోపణలపైనే పోసానిని ఎక్కువగా పోలీసులు విచారించారు.
అయితే విచారణ సందర్భంగా పోసాని వ్యవహరించిన తీరుపై అనేక విమర్శలున్నాయి. పోలీసులను రాజా, రాజా అని పిలవడం ఒకింత ఆశ్చర్యానికి, ఇబ్బందికి గురిచేసినట్లు సమాచారం. ఏదో ఫ్రెండ్స్ ని, ఫ్యాన్స్ ని పిలిచినట్లు పోలీసులను రాజా రాజా అని పిలవడమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాళ్లకు చట్టాలంటే గౌరవం లేదని.. అందుకే ఇలా తయారయ్యారని కొందరు ఎద్దేవా చేస్తున్నారు. ఇలాంటి వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసుల ముందు అన్నీ ఒప్పేసుకున్న పోసాని.. రేపు కోర్టులో కూడా నేరాన్ని అంగీకరిస్తారా అనేది చూడాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్లంతా పోలీసుల ముందు ఇలాగే వ్యవహరిస్తారు. కోర్టుకు వెళ్లాక తనతో బలవంతంగా అలా చెప్పించి సంతకం చేయించుకున్నారని ప్లేట్ ఫిరాయిస్తుంటారు.













