వృద్ధుడికి సీఎం చంద్రబాబు పాదాభివందనం
పశ్చిమగోదావరి జిల్లా తంగెళ్లమూడి గ్రామానికి చెందిన 81 ఏళ్ల వృద్ధుడు అబ్బనేని నారాయణరావు ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణానికి రూ.10,116 విరాళం అందజేశారు. పింఛను మొత్తంలో కొంత దాచి, విరాళంగా ఇచ్చారు. రామాయణంలో శ్రీరామచంద్రుడు వారధి కట్టడానికి ఉడత సాయంచేసినట్లుగా, తాను శక్తిమేరకు సాయమందిస్తున్నానని అన్నారు. ఆ వృద్ధుడి పెద్దమనసుకు ముగ్ధుడైన చంద్రబాబు ఆయనకు పాదాభివందనం చేశారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆయన ఇచ్చిన లేఖపై అభినందనలతో చంద్రబాబు, ముఖ్యమంత్రి అని స్వహస్తాలతో రాసి అందజేశారు.













