ఈ పాపం ఎవ్వరిది?
తండ్రి నిండునూరేళ్లు చల్లగా చూడు.. అంటూ ఆ దేవదేవుణ్ని దర్శించుకునేందుకు వెెళ్లిన ఆరేళ్ల చిన్నారి లక్షిత చిరుత నోట చిక్కి ప్రాణాలు కోల్పోయింది. అప్పటివరకూ ఆీడుతూ, పాడుతూ తమతోనే వచ్చిన లక్షిత.. కళ్లముందే చిరుతకు బలికావడం ఆకుటుంబాన్ని షాక్ కుగురిచేసింది. ఇప్పుడా చిన్నారి కుటుంబానికి టీటీడీ 5లక్షలు, అటవీశాఖ 5 లక్షలు పరిహారం ప్రకటించారు. పరిహారం సంగతి సరే.. పోయిన చిన్నారి లక్షిత ప్రాణాన్ని వెనక్కి తేగలరా? ఈ ఘటనకు బాధ్యత ఎవరిది?
శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో చిన్నారి లక్షిత కుటుంబ సభ్యులు అలిపిరి కాలినడక మార్గంలో శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. రాత్రి 11 గంటలకు వారు లక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులకు కాస్త ముందు నడుస్తున్న బాలికపై అకస్మాత్తుగా చిరుత దాడి చేసింది. కుటుంబసభ్యులు భయంతో పెద్దగా కేకలు వేయడంతో బాలికను అడవిలోకి ఈడ్చుకెళ్లింది. దీంతో బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే రాత్రి సమయం కావడంతో గాలింపు చర్యలు చేసేందుకు వీలుపడలేకవడంతో… శనివారం ఉదయం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సమీపంలోనే బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బాధితులది నెల్లూరు జిల్లాలోని పోతిరెడ్డిపాలెం అని తెలుస్తోంది.
ఇటీవల చిరుత నోట చిక్కిన చిన్నారి అనూహ్యంగా ప్రాణాలతో బయటపడ్డాడు. జూన్ నెలలో రాత్రిపూట తిరుమల అలిపిరి నడక దారిలో కొండకు వెళ్తున్న ఓ చిన్నారిపై చిరుత దాడి చేసింది. నడక మార్గంలో వస్తున్న బాలుడిని నోట చిక్కించుకుని అడవిలోకి పరుగులు తీసింది. ఈ ఘటనతో షాక్కు గురైన బాలుడి తల్లిదండ్రులు అప్రమత్తమై చిరుతను వెంబడించారు. బాలుడిని అడవిలోకి లాక్కెళ్లిన చిరుత వెంటే స్థానికులు అరుపులు కేకలతో వెంటపడ్డారు. అప్పటికే బాలుడిని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లిపోయింది. ఈ ఘటనలో స్థానికుల అప్రమత్తత బాలుడి ప్రాణాలు కాపాడింది. ఈ ఘటన తర్వాతైనా టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేసి ఉంటే చిన్నారి .. తల్లితండ్రులతో శ్రీవారిని దర్శించుకుని హాయిగా ఉండేది.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన టీటీడీ యంత్రాంగం ప్రవర్తించింది. రెండు కాలినడక మార్గాలను సాయంత్రం 6 గంటలకు మూసేయాలని ఆలోచిస్తున్నామన్నారు టీటీడీ ఈవో. టీటీడీ ఛైర్మన్, అధికారులతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే ప్రతి 10 మీటర్లకు ఒక సెక్యూరిటీ గార్డును నియమిస్తామని ధర్మారెడ్డి తెలిపారు. నడకమార్గంలో వచ్చే భక్తులు చిన్న పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈవో కోరారు.
అయితే ఈ తతంగం ఎన్నాళ్లన్నదే ప్రశ్న. ఎందుకంటే ఘటన జరిగిన సమయంలో హడావుడి చేయడం తర్వాత సైలెంట్ కావడం టీటీడీ తీరుగా ఉంటోంది. మరో లక్షిత .. ఓ క్రూరమృగానికి బలికాకుండా చూడాల్సిన బాధ్యత టీటీడీ అధికారులపై ఉంది.













