ప్రపంచంలోనే ఎత్తయిన ఆంజనేయ స్వామి విగ్రహం
ప్రపంచంలోనే ఎత్తయిన 171 అడుగుల విరాట్ శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో ఏర్పాటు చేస్తున్నామని వైఎస్ఆర్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మీ తెలిపారు. ఈ విగ్రహానికి ఈ నెల 7న గణపతి సచ్చిదానంద స్వామీజీ భూమి పూజ చేస్తారని తెలిపారు. రాజమహేంద్రవరంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మహావీర్ హనుమాన్ ట్రస్ట్ ద్వారా రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువు అవధూత పీఠం వద్ద ఈ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కొత్తగా ఏర్పడిన తూర్పు గోదావరి జిల్లాకు రాజానగరం నియోజకవర్గం ముఖద్వారంగా ఉందని, ఈ ప్రాంతం మీదుగా ప్రయాణించే వారు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలనే లక్ష్యంతో ఈ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలిరావాని కోరారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను విజయలక్ష్మీ, తోట సుబ్బారావు, ఇన్నమూరి దీపు, అశ్విన్ జవార్, కేఎల్ఎన్ రెడ్డి, మేడి త్రిమూర్తులు, లంక సత్యనారాయణ తదితరులు ఆవిష్కరించారు.













