అర్ధవంతంగా ముగిసిన 14వ అసెంబ్లీ సమావేశాలు
అనేక సమస్యలను సభలో చర్చించి పరిష్కరించాం… శాసనసభ చీఫ్ విప్ పల్లె రఘనాధరెడ్డి వెల్లడి
14వ అసెంబ్లీ సమావేశాలు అర్ధవంతంగా ముగిశాయని చీఫ్ విప్ పల్లె రఘనాధరెడ్డి సచివాలయంలో మీడియాకు వెల్లడించారు. 14వ సభ 127 రోజులు సమావేశం అయింది. 630.42 గంటలపాటు వివిధ సమస్యలపై చర్చించారని రఘునాధరెడ్డి ప్రకటించారు. టీడీపీ సభ్యులు 497 గంటలు, వైసీపీ సభ్యులు 92.5 గంటలు, బీజేపీ సభ్యులు 35.38 గంటలు, నవోదయం పార్టీ సభ్యులు 28 నిమిషాలు వివిధ సమస్యలపై చర్చించారని తెలిపారు. మొత్తం మీద గందరగోళం కారణంగా గం. 13.41 నిమిషాల సమయం వృధా అయిందని తెలిపారు. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 81 గంటల నాలుగు నిమిషాలు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి 26 గంటల 38 నిమిషాలు సభలో వివిధ అంశాలపై మాట్లాడారని అసెంబ్లీ చీఫ్ విప్ పల్లె రఘునాధరెడ్డి వెల్లడించారు.
ప్రస్తుత సమావేశాలు ఆరు రోజులపాటు జరిగాయి. సభలో నీటిపారుదల, వ్యవసాయం, విజన్ 2024, సాంఘీక సంక్షేమం, మానవవనరులు ఇలా అనేక అంశాలపై కూలంకుషంగా చర్చలు జరిపామని అసెంబ్లీ చీఫ్ విప్ పల్లె రఘునాధరెడ్డి తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపడం, నాలుగున్నర సంవత్సరాల కాలంలో చేసిన పలు అభివృద్ది పనులు వివరించండంతోపాటు, అనేక సమస్యలకు ఈ సభలో పరిష్కారం లభించిందని ఆయన చెప్పారు. ప్రధాన ప్రతిపక్షం సభ్యులు సభకు రాకుండా జీతాలు తీసుకోవడం అనైతికమని, ప్రజల సమస్యలపై జరిగే చర్చల్లో పాల్గొనకుండా ప్రతిపక్షం సభ్యులు జీతాలు తీసుకుని ప్రజలకు ద్రోహం చేశారని పల్లె విమర్శించారు. మొత్తం మీద అసెంబ్లీ సమావేశాలు అర్ధవంతంగా ముగిశాయని పల్లె రఘనాధరెడ్డి వెల్లడించారు.













