పల్లెల ముఖచిత్రాన్ని మారుస్తున్న నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్లో ఉన్న పల్లెల స్వరూపాన్ని పూర్తిగా మార్చేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి నారా లోకేేష్ కంకణం కట్టుకున్నారు. పల్లెల్లో ప్రగతికి కావాల్సిన సౌకర్యాల ఏర్పాటుపై దృష్టి సారించారు. ముందుగా రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించారు. గతంలో పల్లెలకు వెళ్ళాలంటే రోడ్లు సరిగా లేక ఇబ్బందులు ఎదురయ్యేవి. దానికితోడు చినుకు పడితే చిత్తడిగా మారే రోడ్లు..కంకర లేచిన గోతులతో కూడిన రహదారులు.. గూడాలు, తండాలకు వెళ్లాలంటే మోకాళ్లలోతు మట్టితో కనిపించే పల్లెలను అభివృద్ధిలోకి తీసుకురావాలంటే ముందుగా రోడ్ల నిర్మాణమే ముఖ్యమని లోకేష్ భావించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తరువాత పల్లెల ముఖచిత్రం మారిపోయింది. నాటి గతుకుల రోడ్లు నేడు ప్రగతికి బాటలుగా మెరిసిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో దారిలేని ఊరు ఉండకూడదనే ఉద్దేశంతో రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దష్టి సారించిన మంత్రి లోకేష్ ఇందుకోసం కోట్లాది రూపాయలు వెచ్చించి రహదారుల నిర్మాణం చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా రూ 5694.44 కోట్ల ఖర్చుతో 23,553 కిలోమీటర్ల మేర రోడ్లు వేయించారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం నిధులను పక్కదారి పట్టించారు. ఎలాంటి పనులు చేపట్టలేదు. గ్రామ పంచాయతీల దగ్గర ఉన్న కొద్దిపాటి నిధులేమో రహదారుల నిర్మాణానికి సరిపోయేవికావు. ఇలాంటి సమయంలో ఉపాధి నిధులను, పనులను అనుసంధానం చేసి ప్రారంభించిన సిమెంట్ రోడ్ల నిర్మాణ కార్యక్రమం పల్లెల రూపురేఖల్ని మార్చేస్తోంది. ప్రతి ఏటా లక్ష్యాన్ని పెంచుకుంటూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 22,283 కిలోమీటర్ల గ్రామీణ బీటీ రోడ్ల మరమ్మతులు, నిర్వహణకు రూ 2658 కోట్లు కేటాయించారు. రూ 3576 కోట్ల ఏఐఐబీ నిధులతో 4826 కిలోమీటర్ల నూతన రోడ్ల నిర్మాణం చేపట్టారు. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న 1002 రోడ్ల మరమ్మతు పనుల కోసం రూ 365 కోట్ల నిధులు కేటాయించారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకంలో భాగంగా 390 చోట్ల పనులు జరుగుతున్నాయి. మరో 8వేల కిలోమీటర్ల రహదారులన్నింటినీ సీసీ రహదారులుగా మార్చేయాలని పంచాయతీరాజ్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ఉపాథి హామీ పథకం నిధుల వినియోగంలో, పనుల విషయంలో ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. సీసీ రోడ్ల నిర్మాణం విషయంలోనూ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందుంది.
ఒక గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినప్పుడు ముందుగా ఎస్సీ, ఎస్టీ కాలనీల నుంచే ప్రారంభం కావాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఈ పద్ధతిని విధిగా అమలు చేయటంతో మంచి ఫలితాలు సాధించారు. సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం సగం భరిస్తే మిగిలిన సగం గ్రామ పంచాయతీలు భరించాల్సి ఉంది. మైదాన ప్రాంతాల్లోని గ్రామాలకు ఇది వరంగా మారినా మారుమూల గిరిజన ప్రాంతాలకు మాత్రం ఈ పథకంలో లబ్ధి పొందడం సాధ్యం కాలేదు. 50 నుంచి 100 ఇళ్లు మాత్రమే ఉండే గూడెం పంచాయతీలకు 50 శాతం సొమ్ము భరించే శక్తిలేదు. దీంతో ఆయా తండాలకు సీసీ రోడ్లు కలగా మిగిలాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి తండాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి 90 శాతం విలువను మెటీరియల్ రూపంలో అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చి నిధులు మంజూరు చేస్తోంది.
గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణంతోనే ప్రభుత్వం సరిపెట్టలేదు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేపట్టారు. రోడ్లు వేశాక వాటిని మళ్లీ తవ్వి మొక్కలు నాటడం కాకుండా నిర్మాణం పూర్తయ్యే సమయంలోనే రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటుతున్నారు. ఇలాగే రోడ్ల నిర్మాణంలో సాంకేతికతను ఎలా వినియోగిస్తున్నారు.. నాణ్యత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే అంశాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది.
రోడ్ల నిర్మాణం ఎలా జరుగుతోందో ఎప్పటికప్పుడు పరిశీలించే కార్యక్రమానికి మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారు. తాను దత్తత తీసుకున్న నిమ్మకూరు గ్రామంలో రోడ్ల నిర్మాణాన్ని తొలిసారిగా లోకేష్ పరిశీలించారు. ప్రతి జిల్లాకు రెండు డ్రోన్లను కొనుగోలు చేశారు. సిమెంట్ రహదారులే కాకుండా పరిశుభ్రత, పచ్చదనం తదితర కార్యక్రమాలన్నింటినీ పరిశీలించేందుకు వీలుగా ప్రణాళిక సిద్ధం చేశారు.













