ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు 100 కంపెనీలు ఆసక్తి
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్, ఆసియా దేశాలకు చెందిన 100 కంపెనీలు ఆసక్తి కనబరిచాయి. ఆంధ్రప్రదేశ్ అధికారుల బృందంతో సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ మంగళవారం ఆ దేశంలో సమావేశమయ్యారు. సింగపూర్లో అంతర్జాతీయ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో ఆసియా-సింగపూర్ వౌలిక వసతుల రౌండ్ టేబుల్ సదస్సులో ఎపిలో పెట్టుబడులపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. దాదాపు 100 కంపెనీలు ఆసక్తి కనబరచడంతో సదస్సు విజయవంతమైనట్లుగా భావిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అనుమతులు మంజూరు ప్రక్రియ, విద్యుత్, భూమి లభ్యత తదితర అంశాలపై అధికారులు సదస్సులో వివిధ కంపెనీల ప్రతినిధులకు వివరించారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి స్థానంలో ఉండటం, పెట్టుబడుదారులకు కల్పిస్తున్న రాయితీలు వివరించారు. ఇంజనీరింగ్, నిర్మాణ పనులు, భద్రతా వ్యవస్థ, ఇంజనీరింగ్ డిజైన్లు, సుస్థిర ఇంధన సామర్థ్యం, జిపిఎస్, అసెట్ మేనేజ్మెంట్, ఆహార పదార్ధాల ప్రొసెసింగ్, స్మార్ట్ సిటీ సొల్యూషన్లు, ఆతిథ్య రంగం, ఎలక్ట్రిక్ ట్రాన్స్పోర్టు, ఐఒటి, ఇ-కామర్సు తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీలు ముందుకు వచ్చాయి. అమరావతిలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అక్కడి ప్రతినిధులకు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ వివరించారు. పెట్టుబడిదారులకు మిత్ర రాష్ట్రంగా ఎపిని తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. పర్యాటక, ఇంధనం, వౌలిక వసతుల కల్పన రంగాల్లో ఉన్న అవకాశాలను సిఆర్డిఎ ప్రత్యేక కమిషనర్ రామ మనోహరరావు వివరించారు













