ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం
భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన గౌరవాన్ని సాధించారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల జాబితాలో టాప్ టెన్‌లో ఆయన స్థానం సాధించారు. ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో ఆయన 9వ స్థానంలో నిలిచారు. 2018 సంవత్సరానికి ఫోర్బ్స్ ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ప్రపంచ జనాభాలో 75 మంది అత్యంత శక్తివంతమైన వారిగా ఈ జాబితాలో నిలిచారు. మోదీ 9వ స్థానం సంపాదించగా, ఫేస్బుక్ సీఇఓ మార్క్ జుకర్‌బర్గ్ 13వ స్థానంలో, యూకె ప్రధాని థెరిసా మే 14వ స్థానంలో నిలిచారు.
ఇక ఈ జాబితాలో చైనా అధ్యక్షుడు జిన్పింప్ తొలిసారిగా ప్రథమ స్థానంలో నిలిచారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ 2, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 3, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ 4, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 5, పోప్ ప్రాన్సిస్ 6, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ 7, సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సాద్ 8, ఆల్ఫాబెట్ సీఈవో లారీ పేజ్ 10వ స్థానంలో నిలిచారు.













