కరుణానిధి కన్నుమూత
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(94) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి ఈరోజు సాయంత్రం 6.10గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. కరుణ మృతి వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు, డీఎంకే శ్రేణులు ఆసుపత్రి వద్దకు భారీగా తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నగరంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకున్నారు. కరుణానిధి మరణంతోఆయన కుటుంబ సభ్యులు, డీఎంకే కార్యకర్తలు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు.













