విమాన ప్రయాణికులకు శుభవార్త
విమాన ప్రయాణికులకు శుభవార్త. ఇకపై గుర్తింపు కార్డులు, బోర్డింగ్ పాసులు విమానాశ్రయాల్లోని ప్రతి చెక్ పాయింట్ వద్ద చూపించే బాధ వారికి తప్పనుంది. ఎందుకంటే వాటి స్థానాల్లో ముఖ గుర్తింపు సాంకేతికతను (ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ)తీసుకురానున్నారు. డిజీ యాత్ర పథకం కింద ప్రభుత్వం ఈ మేరకు ప్రణాళిక విడుదల చేసింది. చిన్న విమానాశ్రయాల్లో అనూహ్యంగా పెరుగుతున్న విమాన ప్రయాణికుల రద్దీ దృష్ట్యా, భద్రత వల్ల సమయం వృథా కాకుండా ఉండేందుకు ఈ సాంకేతికతను ప్రవేశపెట్టనున్నట్టు పౌర విమానయానశాఖ వెల్లడించింది.
వచ్చే ఏడాది మొదట్లో మొదలు కానున్న ఈ విధానంలో ప్రయాణికులు తమకు తామే ఓ ధ్రువీకృత ఆన్లైన్ పోర్టల్‌లో తమ పోటోతో సహా వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల డొమెస్టిక్ విమానాల్లో ప్రయాణించేవారు విమానాశ్రయాల్లోని చెక్ పాయింట్ వద్ద తమ గుర్తింపును బయోమెట్రిక్ విధానం ద్వారా ధ్రువీకరించుకోవచ్చు. ఈ కొత్త విధానం వల్ల ప్రతి చోట గుర్తింపు కార్డు, బోర్డింగ్ పాస్‌ను చూపి స్టాంపులు వేయించుకోనే అవసరం లేకపోవడంతో సమయం ఆదా అవుతుందని విమానయానశాఖ్ మంత్రి సురేశ్ ప్రభు అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాల్లో ఈ విధానం ప్రవేశపెట్టి, ఏప్రిల్ కల్లా విజయవాడ, కోల్‌కతా, పుణె, వారణాసి విమానాశ్రయాలకు విస్తరిస్తామని విమానయానశాఖ వర్గాలు వెల్లడించాయి.













