రామభక్తులకు శుభవార్త
అయోధ్యలో రామాలయ నిర్మాణంపై బీజేపీ వర్గాలు దూకుడు పెంచాయి. దేశంలో వేర్వేరు చోట్ల కేంద్ర మంత్రులతో పాటు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఈ అంశంపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో త్వరలోనే రామాలయ నిర్మాణం జరగనుందని, దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న రామభక్తులు ఓ శుభవార్త వినబోతున్నారని ఆయన చెప్పారు. దీపావళి వేడుకను అయోధ్యలో ఘనంగా నిర్వహించనున్నామని అన్నారు. హరిద్వార్‌లో జ్ఞానకుంభ్ ముగింపు ఉత్సవంలో ఆయన ప్రసంగించారు. దీపావళి రోజు ప్రతిఒక్కరూ రాముడి పేరిట ఒక దీపాన్ని వెలిగించాలని కోరారు. రామాలయ నిర్మాణాన్ని ప్రపంచంలోనే ఏ శక్తి ఆపజాలదని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ బిహార్‌లోని నవాద్లో చెప్పారు. మందిరం నిర్మాణానికి ప్రభుత్వం, న్యాయస్థానం ఒక మార్గాన్ని అన్వేషించాలని ప్రజలు కోరుకుంటున్నట్లు ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. శ్రీరాముడిపై దేశంలో 100 కోట్ల మందికిపైగా ప్రజల్లో భక్తి విశ్వాసాలు ఉన్నాయి. తమ ఆశల మీద నీళ్లు జల్లుతుండడంపై వారిలో అసంతృప్తి, అసహనం వ్యక్తమవుతున్నాయి. మందిర నిర్మాణానికి త్వరలోనే మార్గం సుగమమవుతుంది. దానిని ప్రపంచంలో ఎవరూ అడ్డుకోలేరు అని ఆయన తెలిపారు.













