వచ్చే జనవరి 1 నుంచే కొత్త ఆర్థిక సంవత్సరం!
నవంబరులో కేంద్ర బడ్జెట్
చరిత్రాత్మక మార్పునకు సన్నాహం
దేశంలో గత 150 ఏళ్లుగా అమలులో ఉన్న ఆర్థిక సంవత్సర కాలమాని(కేలండర్) త్వరలోనే మారిపోనుంది. ప్రస్తుత ఏప్రిల్-మార్చికి బదులుగా జనవరి-డిసెంబరు ఆర్థిక సంవత్సర కాలమాని 2018 ప్రారంభం నుంచే మొదలు కానుంది. దీని కోసం వార్షిక బడ్జెట్ సమర్పణను కూడా మరింత ముందుకు జరిపి నవంబరులోనే పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
2017-18 వార్షిక బడ్జెట్ను గతంలో కన్నా భిన్నంగా ఫిబ్రవరి చివరి వారంలో కాకుండా అదే నెల ఒకటో తేదీనే కేంద్ర ప్రభుత్వం సమర్పించింది. ఈ దఫా వచ్చే నవంబరులోనే బడ్జెట్ను సమర్పించటం ద్వారా 2018 జనవరి 1 నుంచే కొత్త ఆర్థిక సంవత్సర ప్రారంభానికి మార్గం సుగమం చేయాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికార వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాటిస్తున్న ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్1 నుంచి మార్చి 31)ను బ్రిటన్లోని తమ ప్రభుత్వ వెసులుబాటు కోసం 1867లో ఆంగ్లేయులు తీసుకొచ్చారు. దీని కోసం అప్పటి వరకూ అనుసరిస్తూ వస్తున్న మే1-ఏప్రిల్30 ఆర్థిక సంవత్సరాన్ని మార్చివేశారు.
నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి బాధ్యతలు చేపట్టాక మన దేశ అవసరాలకు తగిన విధంగా ఆర్థిక సంవత్సరం ఉండాలని నిర్ణయించారు. ఆర్థిక సంవత్సరం మార్పు సాధ్యాసాధ్యాల పరిశీలనకు నియమించిన అత్యున్నత స్థాయి కమిటీ గత డిసెంబరులో నివేదికను సమర్పించింది. వివిధ పథకాల అమలు, బడ్జెట్ సక్రమ అమలు, అంతర్జాతీయ గణాంకాల సేకరణకూ ఆర్థిక సంవత్సరాన్ని జనవరి 1 నుంచే ప్రారంభించాల్సిన ఆవశ్యకత ఉందని నీతి ఆయోగ్ కూడా అభిప్రాయపడింది. పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా ఆర్థిక సంవత్సర మార్పునకు సానుకూలత వ్యక్తం చేసింది.













