అర్జున కు మనికా బాత్రా
కామన్వెల్త్ క్రీడల్లో నాలుగు పతకాలు కొల్లగొట్టి సంచలనం సృష్టించిన భారత టేబుల్ టెన్నిస్ సంచలనం మనికా బాత్రా ప్రతిష్ఠాత్మక క్రీడా పురస్కారం అర్జునకు నామినేట్ అయింది. గోల్డ్ కోస్ట్‌లో మనికా ప్రదర్శనను పరిగణనలోకి తీసుకొని ఆమె పేరును అవార్డుకు ప్రతిపాదించినట్టు భారత టీటీ సమాఖ్య (టీటీఎఫ్ఐ) తెలిపింది. ఇక మనికాతో పాటు మరో టీటీ ఆటగాడు హర్మీత్ దేశాయ్ పేరును కూడా అర్జునకు పంపినట్టు వెల్లడించింది. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం నెగ్గిన భారత పురుషుల జట్టులో హర్మీత్ సభ్యుడు. మనికా నామినేషన్ పంపాం. గోల్డ్‌కోస్ట్‌లో ఆమె ప్రదర్శనను చూస్తే అవార్డుల కమిటీ ఎట్టిపరిస్థితుల్లోనూ మనికా పేరు విస్మరించదనే అనుకుంటున్నాను అని టీటీఎఫ్ఐ అధికారి అభిప్రాయపడ్డారు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో తొలిసారి భారత మహిళల జట్టు స్వర్ణం నెగ్గడంలో కీలకపాత్ర పోషించిన 22 ఏళ్ల మనికా, మహిళల సింగిల్స్‌లో స్వర్ణం, డబుల్స్‌లో రజతం, మిక్స్డ్ డబుల్స్‌లో కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే.













