సామాన్యుడి పట్టాభిషేకం
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ లోని చారిత్రక రాంలీలా మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రితోపాటు గత క్యాబినెట్లోని ఆరుగురు మంత్రులతో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ప్రమాణం చేయించారు. అనంతరం భారీ జనసందోహాన్ని ఉద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించారు. భారత్ మాతాకీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ తన ప్రసంగాన్ని మొదులుపెట్టారు. కేంద్ర ప్రభుత్వంతో తాము సామరస్యంగా పనిచేయాలని కోరుకుంటున్నామని తెలిపారు. దేశ రాజధాని నగరాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని ఆశీస్సులు కోరుతున్నానన్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించాం. అయితే ఆయన రాలేదు. బహుశా వేరే కార్యక్రమంలో బిజీగా ఉన్నారనుకుంటా. ఢిల్లీ అభివృద్ధికి, సుపరిపాలన కోసం ఈ వేదికగా ప్రధాని మోదీతో పాటు కేంద్ర కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులు కోరుతున్నా అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.













