తెరపైకి ‘ప్రత్యేక హోదా’
బిహార్ సీఎం నితీష్ కుమార్.. తన చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మొన్నటికి మొన్న కులగణన పూర్తి చేసిన నితీష్ సర్కార్… ఇప్పుడు ప్రత్యేకహోదా అంశాన్ని తెరపైకి తెచ్చారు. వీలైనంత త్వరగా తమ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ హెచ్చరించారు. బిహార్ అభివృద్ధి పథంలో సాగేందుకు ప్రత్యేక హోదా అవసరమని ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. తమ డిమాండ్‌కు మద్దతు తెలపనివారు రాష్ట్ర అభ్యున్నతి వ్యతిరేకులని అభివర్ణించారు.
‘మరో రెండేళ్లలో బిహార్ ఎన్నికలకు వెళ్లనుంది. దీంతో ఇప్పటి నుంచే .. తన అస్త్రాలను సంధిస్తున్నారు నితీష్ కుమార్. ఇందులో భాగంగానే ప్రత్యేకహోదా అంశాన్ని లేవనెత్తారు. సమాజంలో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు పలు సంక్షేమ పథకాలు అందించాలని నిర్ణయించాం. ఇందుకోసం బిహార్‌లాంటి పేద రాష్ట్రానికి అనేక కోట్ల రూపాయల వ్యయమవుతుంది. అయిదేళ్లలో మేం ఖర్చు పెట్టాల్సి ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తే ఆ సదుపాయాలన్నీ ప్రజలకు రెండున్నరేళ్లలోనే అందించగలుగుతాం. ఈ నేపథ్యంలో బిహార్‌కు తక్షణం ప్రత్యేక హోదా అవసరం’ అని నీతీశ్ పేర్కొన్నారు.
ప్రస్తుతం బిహార్ లో జేడీయూ, ఆర్జేడీ కూటమి అధికారంలో కొనసాగుతోంది. బీజేపీ నుంచి బయటకు వచ్చిన నితీష్ కుమార్ కు.. ఆర్జేడీ అధ్యక్షుడు తేజస్వీయాదవ్ అండగా నిలిచారు. దీంతో ఈకూటమి పాలన పగ్గాలు చేపట్టి ముందుకెళ్తోంది. అయితే ఇండియా కూటమి ఏర్పాటులో మొన్నటివరకూ నితీష్ బిజీగా గడిపారు. నితీష్ ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి తేజస్వీయాదవ్ సైతం మద్దతు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్ పెట్టడంతో.. రాష్ట్ర రాజకీయాల్లో నితీష్ యాక్టివ్ అయ్యారు. బీజేపీని కట్టడి చేసే అంశాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు నితీష్ కుమార్.
ఇటీవల పొరపాటున గర్భనిరోధక అంశానికి సంబంధించి నోరుజారి సారి చెప్పారు నితీష్. ఆసమయంలో నితీష్ సర్కార్ పై తీవ్రస్థాయిలో బీజేపీ విరుచుకపడింది. సారీ చెప్పినా, రాజీనామాకు విపక్షనేతలుడిమాండ్ చేశారు. దీంతో యాక్టివ్ అయిన నితీష్ కుమార్… కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రత్యేకహోదా అంశాన్ని యూత్ లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు ప్రారంభించినట్లు కనిపిస్తోంది. అంతేకాదు.. బిహార్ పై కేంద్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందన్న అంశాన్ని మరింత ప్రభావవంతంగా వినిపించేందుకు నితీష్ ప్రయత్నిస్తున్నారు.













