మన జ్వరానికీ చైనా మందేనా..? ఇవేం బతుకులు!
ప్రపంచంలో ఎన్నో అంశాల్లో భారత్ ముందుంది. ముఖ్యంగా వైద్యారోగ్య రంగంలో భారత్ పాత్ర మర్చిపోలేనిది. కరోనా కష్టకాలంలో ప్రపంచంలో తయారవుతున్న వ్యాక్సిన్లలో అగ్రభాగం మన దేశం నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. కరోనాను ఎదుర్కొనేందుకు భారత్ చేస్తున్న కృషి మరువలేనిదని సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థే వెల్లడించింది. బ్రిటన్ కు చెందిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ మన పూణెలో తయారవుతోంది. ఇక హైదరాబాద్ వ్యాక్సీన్ కేపిటల్ గా పేరొందింది. కేవలం వ్యాక్సీన్లు మాత్రమే కాదు.. మన దేశంలోని ఔషధ కంపెనీలు ప్రపంచంలోనే పేరొందాయి. ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలకు సైతం మన మందులు ఎగుమతి అవుతున్నాయి. సంక్లిష్టమైన రోగాలకు కూడా మందులను కనుగొన్న ఘనత మన దేశీయ కంపెనీలది.
ప్రపంచమంతా తిరిగినోడు పాడుబడ్డ బావిలో పడి సచ్చాడంటారు. ఇప్పుడు భారత్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ప్రపంచానికంతటికీ మందులను సప్లై చేస్తున్న భారత్.. ఇప్పుడు పారాసిటమాల్ కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోందట. పారాసిటమాల్ జ్వరం, ఒళ్లునొప్పులకు వాడతారు. ఇది మనుషుల దైనందిన జీవితంలో ఓ భాగమైంది. చిన్నపాటి జ్వరం వచ్చినా డాక్టర్ దగ్గరకు వెళ్లకుండానా పారాసిటమాల్ వేసుకోవడం అలవాటు. అయితే ఇప్పుడు ఆ మందులకూ కొరత వచ్చే ప్రమాదం కనిపిస్తోంది.
పారాసిటమాల్ మాత్రలకు అవసరమయ్యే ముడిసరుకు పారా అమినో ఫినాల్-పీఏపీ. దీన్ని చైనాలోని ఓ కంపెనీ ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేసి.. ఎగుమతి చేస్తోంది. ప్రపంచ ఎగుమతుల్లో ఈ కంపెనీ వాటా 50శాతానికి పైనే. పారాసిటమాల్ ఉత్పత్తి చేసే మన దేశీయ కంపెనీలన్నీ ఈ కంపెనీ ముడిసరుకుపైనే ఆధారపడ్డాయి. ఇప్పుడు ఆ కంపెనీ మూత పడింది. దీంతో ముడిసరుకు సరఫరా ఆగిపోయింది. మరోవైపు మిగిలిన కంపెనీలు ధర అమాంతం పెంచేశాయి. పైగా సరుకు అందుబాటులో ఉండట్లేదు. దీంతో దేశీయ కంపెనీలు ప్రత్యామ్నాయాల వైపు చూడాల్సి వస్తోంది. ఇప్పటికే పారాసిటమాల్ ధరలను పెంచేశాయి.
చైనా మోసాలను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న భారత్.. ఆ దేశ ఉత్పత్తులపై నిషేధం విధిస్తోంది. ఇప్పటికే పలు చైనా యాప్ లను నిలిపేసింది. మరోవైపు భారతీయ మార్కెట్లన్నీ చైనా వస్తువులతో నిండిపోతున్నాయి. గుండు సూది మొదలు ఫోన్ల, కంప్యూటర్ల వరకూ అన్నీ చైనావే. చైనా వస్తువు లేని ఇల్లు భారత్ లో లేదంటే ఆశ్చర్యం లేదు. ఇప్పుడు మనకు జ్వరం వస్తే కూడా చైనా మందు పైనే ఆధారపడ్డామంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే మేం తోపులం అని చెప్పుకునే భారతీయ ఔషధ కంపెనీలు కూడా ఇప్పుడు బేల చూపులు చూస్తున్నాయంటే మన డొల్లతనం ఏంటో అర్థమైపోతోంది. ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు బయటపడతామో చూడాలి మరి.













