usa on mexico, canada: మెక్సికో, కెనడాలకు ట్రంప్ చురకలు…
పొరుగు దేశాలు పొందుతున్న రాయితీలపై అమెరికాకు కాబోయే నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి స్పందించారు. కెనడా (Canada), మెక్సికో(mexico) దేశాలకు భారీఎత్తున రాయితీలు ఇవ్వడం కంటే ఆ రెండు అమెరికా రాష్ట్రాలైతే సరిపోతుందని వ్యాఖ్యానించారు. ‘‘కెనడాకు ఏటా 100 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.8 లక్షల కోట్లకు పైమాటే)కు పైగా రాయితీలు కల్పిస్తున్నాం. ఇక, మెక్సికో (Mexico)కు 300 బిలియన్ డాలర్ల (రూ.24లక్షల కోట్లు) సబ్సిడీ ఇస్తున్నాం. ఎందుకు ఆ దేశాలకు మనం రాయితీలు ఇవ్వాలి? దానికంటే ఆ రెండు దేశాలు అమెరికాలో విలీనమైతేనే మంచిది’’ అని ట్రంప్ (Trump) వ్యాఖ్యానించారు.
అక్రమ వలసదారులను కట్టడి చేయకపోతే కెనడా, మెక్సికో దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తానని కాబోయే అధ్యక్షుడు ఇదివరకే హెచ్చరించారు. ఈక్రమంలోనే ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఫ్లోరిడాకు వచ్చి ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఆ సమయంలో టారిఫ్‌లు, సబ్సిడీల అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణా కట్టడి చేయడంలో విఫలమైతే కెనడా.. అమెరికా 51వ రాష్ట్రంగా చేరాలని ఆయన ట్రూడోకు చురకలు అంటించినట్లు వార్తలు వచ్చాయి.
నాలుగేళ్లలో అక్రమ వలసదారులందరినీ అమెరికా దాటిస్తా..
మెరికాలోకి వస్తున్న అక్రమ వలసదారుల గురించి ట్రంప్ స్పందించారు. అధికారం చేపట్టిన తొలిరోజు నుంచే పుట్టుకతో సంక్రమించే పౌరసత్వ అంశంపై దృష్టిసారిస్తానని చెప్పారు. జాతీయ అత్యయిక పరిస్థితి తరహాలో వచ్చే నాలుగేళ్లలో అక్రమ వలసదారులను దేశం దాటిస్తానని వ్యాఖ్యానించారు. డ్రీమర్ ఇమిగ్రెంట్స్’(immigrants) విషయంలో ఓ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకొనే అంశాన్ని పరిశీలిస్తానన్నారు.
ఇక, తాను అధికారంలోకి వచ్చిన తొలి రోజే క్యాపిటల్ భవనంపై దాడి కేసును ఎదుర్కొంటున్న 900 మందికి క్షమాభిక్ష పెడతానని ట్రంప్ సూచనప్రాయంగా వెల్లడించారు. 2020లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ఓటమి తర్వాత.. 2021 జనవరి 6న ఆయన మద్దతుదారులు క్యాపిటల్ భవనంపైకి దూసుకొచ్చి దాడి చేశారు. తన మద్దతుదారులపై కేసు దర్యాప్తులో అవినీతి జరిగిందని ఈ సందర్భంగా ఆరోపించారు ట్రంప్.






