నితీష్ నిష్క్రమణ వెనక…?
ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ నిష్క్రమించడం వెనక బలమైన కారణముందని చెబుతోంది జనతాదళ్ యునైటెడ్ పార్టీ. అసలు నితీష్.. కూటమి నుంచి బయటకు రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపిస్తున్నారు జేడీయూ నేతలు. ప్రతిపక్ష కూటమి నాయకత్వాన్ని హైజాక్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోందని ఆరోపణలు గుప్పించారు. ఈ కుట్రలో భాగంగానే.. మమతా బెనర్జీ సహాయంతో కూటమి తరఫున ప్రధాన మంత్రిగా మల్లిఖార్జున ఖర్గే పేరు ప్రతిపాదించారని జేడీయూ ముఖ్య నేత కేసీ త్యాగి ఆరోపించారు. అంతేకాదు…మహాఘట్బంధన్ కూటమిలో నితీష్ కుమార్‌ను అగౌరవపరిచారని, నితీష్ తన ఉనికి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని జేడీయూ నేతలు వెల్లడించారు.
సీట్ల పంపకాలపై కాలయాపన..
సీట్ల పంపకాల విషయాన్ని కాంగ్రెస్ ఎటూ తేల్చకుండా నాన్చుతూ వచ్చింది. ఈ విషయాన్ని లాగుతూనే వస్తోంది. సీట్ల పంపకాన్ని త్వరగా పూర్తి చేయాలని అనేక సందర్భాల్లో చెప్పినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. ఇండియా కూటమి వద్ద బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే ప్రణాళికలు లేవు అని జేడీయూ నేతలు తెలిపారు. అంతేకాదు.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రధర్మం పాటించలేదని. అందుకే ఆపార్టీ నుంచి మిత్రపక్షాలు సైతం దూరం జరుగుతున్నాయని గుర్తు చేస్తున్నారు. అయితే .. దీన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోంది. తామెప్పుడూ నితీష్‌కుమార్‌కు తగిన గౌరవమే ఇచ్చామంటోంది. ఈ పరిణామం వెనక నిజానికి చాలా పెద్ద కథే నడిచినట్టు తెలుస్తోంది. లలన్ తిరుగుబాటు యత్నమే దీనంతటికీ కారణమని సమాచారం. నితీశ్ స్థానంలో డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు లలన్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టి చివరికి ఆయన ఉద్వాసనకు దారితీసినట్ చెబుతున్నారు!
కొద్ది నెలల క్రితం నుంచే…
ఆర్జేడీతో, ఆ పార్టీ చీఫ్ లాలుప్రసాద్ యాదవ్‌తో లలన్‌సింగ్ సాన్నిహిత్యం ఇప్పటిది కాదు. నితీశ్ కూడా దీన్ని చూసీ చూడనట్టే పోయేవారు. అయితే విశ్వసనీయ వర్గాల కథనం మేరకు… లాలు కుమారుడు తేజస్వికి సీఎం పదవి అప్పగించి నితీశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగాలంటూ కొద్దికాలం క్రితం లలన్ ప్రతిపాదించారు. 18 ఏళ్లపాటు సుదీర్ఘంగా సీఎం పదవిలో కొనసాగినందున అధికార మహాఘట్బంధన్ సంకీర్ణంలో పెద్ద భాగస్వామి అయిన ఆర్జేడీకి సీఎం అవకాశమిస్తే బాగుంటుందని సూచించారు. దీన్ని నితీశ్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు.
లాలు–లలన్ ప్లాన్ ఫెయిల్..
నితీష్ నిరాకరించినా తేజస్విని ఎలాగైనా సీఎం చేసేందుకు లాలు, లలన్ ఒక పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా జేడీ(యూ)ను చీల్చి కనీసం ఒక డజను మంది ఎమ్మెల్యేలను ఆర్జేడీలోకి పంపేందుకు లలన్ ఒప్పుకున్నారు. బదులుగా వచ్చే ఏప్రిల్‌లో ఆర్జేడీ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాన్ని ఆయనకిచ్చేలా అంగీకారం కుదిరింది. 243 మంది సభ్యుల బిహార్ అసెంబ్లీలో జేడీ(యూ)తో నిమిత్తం లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు తేజస్వికి కేవలం మరో ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు చాలు.
కానీ 45 మంది జేడీ(యూ) ఎమ్మెల్యేల్లో డజను మందే పార్టీ ఫిరాయిస్తే వారిపై అనర్హత వేటు ఖాయం. తన అధ్యక్ష పదవి సాయంతో ఈ ముప్పు తప్పించేలా లలన్ ఎత్తే వేశారు. అందులో భాగంగా వారిని పార్టీ నుంచి ఆయనే సస్పెండ్ చేస్తారు. అప్పుడిక వారికి అనర్హత నిబంధన వర్తించదు. ఆనక 12 మంది ఎమ్మెల్యేలూ ఆర్జేడీకి మద్దతు పలికేలా, నితీశ్ సర్కారు కుప్పకూలి తేజస్వి గద్దెనెక్కేలా వ్యూహరచన జరిగినట్లు సమాచారం.ఈ మేరకు 12 మంది జేడీ(యూ) ఎమ్మెల్యేలతో కొద్ది వారాల క్రితం లలన్ గుట్టుగా మంతనాలు కూడా జరిపారు. వారందరికీ మంత్రి పదవులు ఆశ చూపారు. ఆర్జేడీకి చెందిన స్పీకర్ అవధ్ బిహారీ చౌధరి ఇందుకు పూర్తిగా సహకరిస్తారని చెప్పారు. అయితే సదరు ఎమ్మెల్యేల్లో తన వీర విధేయుడైన సభ్యుడొకరు దీనిపై ఉప్పందించడంతో నితీశ్ అప్రమత్తమయ్యారు.













