మరాఠా రాజకీయం..
మహారాష్ట్ర రాజకీయం.. మహామహా తలపండిన నేతలకు సైతం కొరుకుడు పడడం లేదు. ఎవరు ఎవరితో కలిసి ఉంటారో ఎవరికి అర్థం కావడం లేదు. మరాఠా పాలిటిక్స్ ను ఐపీఎల్ తో పోలిస్తూ ఉద్ధవ్ థాక్రే చేసిన వ్యాఖ్యలు.. సరైనవేనని మరోసారి నిరూపితమైంది. ఇవాళ ఒకరిని కలుస్తున్నారు.. రేపు ఇంకొకరిని కలుస్తున్నారు. ఏమంటే… ఏదో కారణం చెబుతూ తప్పించుకుంటున్నారు. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక అటు షిండే సర్కార్, ఇటు విపక్షాలు సైతం అయోమయంలో పడుతున్నాయి.
మొన్నటికి మొన్న ఆర్థికమంత్రి అజిత్ పవార్.. బాబాయ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిసి ముచ్చటించారు. ఎన్సీపీని ఒక్కటిగా ఉంచుదామన్నారు. తమ దేవుడు, ఆదర్శప్రాయుడు శరద్ పవార్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే వీటిపై శరద్ పవార్ స్పందించలేదు.అంతే కాదు.. శరద్ పవార్… షిండే, బీజేపీ సర్కార్ పై తన పోరాటాన్ని కొనసాగిస్తారని ఎన్సీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇంతలోనే మరో ఆసక్తికర ఘట్టం చేటుచేసుకుంది. ఎన్సీపీలో తిరుగుబాటు నేత, ఆర్థిక శాఖ మంత్రి అజిత్ పవార్ ను శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే కలుసుకున్నారు. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి సేవలందించాలని అజిత్ పవార్‌ను కోరినట్టు ఉద్ధవ్ థాక్రే తెలిపారు. ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో అజిత్ పవార్ చేరిన తర్వాత ఆయనను ఉద్ధవ్ థాకరే కలుసుకోవడం ఇదే మొదటిసారి. శాసన సభా మండలి సభ్యుడైన ఉద్ధవ్ థాకరే ..బుధవారం కాసేపు సభాకార్యక్రమాల్లో సైతం పాల్గొన్నారు.
ఇదంతా శరద్ పవార్ మార్గదర్శకత్వంలో జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన సూచనతోటే ఉద్ధవ్ థాక్రేతో అజిత్ సమావేశం జరిగిందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. మరోవైపు అజిత్ తమవైపు వచ్చినా శరద్ పవార్ వైపే ప్రజలు ఉంటారని బీజేపీ భావిస్తోంది. అందువల్ల శరద్ పవార్ ను శాంతింపజేస్తేనే తమకు ఓట్ల రూపంలో లబ్ధి చేకూరుతుందని యోచిస్తున్నట్లు సమాచారం. అందుకే.. బీజేపీ సైతం దీన్ని ప్రోత్సహిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.













