డ్రాగన్ అదుపు ఎలా?
దురాక్రమణే లక్ష్యంగా చెలరేగుతున్న చైనాను నిలువరించడానికి భారత దేశం అన్నిప్రయత్నాలు చేస్తోంది. ఓవైపు సరిహద్దుల్లో ధీటైన జవాబిస్తూ… మన సైనిక శక్తిని చాటి చెబుతోంది. అయితే ఇదే సమయంలో తమకు యుద్ధకాంక్ష లేదని శాంతి కాముక దేశామన్న సందేశాన్ని పంపిస్తోంది. రెండు అతిపెద్ద దేశాల మధ్య యుద్ధం జరగకూడదన్న ఉద్దేశ్యంతో సరిహద్దు ఘర్షణలకు స్వస్తిపలికేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎప్పటికప్పుడు చైనా, భారత్ మిలటరీ ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా చైనా నుంచి సరైన సానుకూల స్పందన రాకపోవడం భారత్ ను కలవరపెడుతోంది.
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత వైఖరిని జాతీయభద్రతా సలహాదారు అజిత్ డోభాల్ స్పష్టం చేశారు. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు .. అజిత్ డోభాల్ గట్టి కౌంటరిచ్చారు.‘‘ ఇరు దేశాల మధ్య నమ్మకం పోయింది. సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి’’ అని ఉద్ఘాటించారు. బ్రిక్స్ దేశాల సమావేశం నిమిత్తం దక్షిణాఫ్రికాలోని జొహెన్న్సబర్గ్లో ఉన్న డోభాల్.. సోమవారం చైనా దౌత్యవేత్తతో సమావేశమయ్యారు.
చైనా ఎప్పటికీ ఆధిపత్య ధోరణి ప్రదర్శించబోదని చైనా దౌత్యవేత్త వాంగ్ యీ అన్నారు. దోభాల్తో భేటీ సందర్భంగా వాంగ్ యీ మాట్లాడుతూ.. పరస్పరం వ్యూహాత్మక విశ్వాసాన్ని పెంచుకుంటూ, సహకరించుకోవడంపై ఇరుదేశాల మధ్య కృషి జరగాలని, తద్వారా సంబంధాలను పూర్వస్థితికి తీసుకురావాలని ఆకాంక్షించారు.
మరోవైపు..అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని చైనా వాదిస్తోంది. అంతే కాదు…ఆపక్కనే ఉన్న ఈశాన్య రాష్ట్రాలపైనా కన్నేసింది. పాకిస్తాన్ ద్వారా కశ్మీర్ విషయంలోనూ ఇబ్బందులు పెడుతోంది. అంతే కాదు.. ఉగ్రముఠా నేతలపై .. ఐక్యరాజ్యసమితి తీర్మానాలను.. వీటో చేస్తూ, భారత్ ను ఇబ్బందుల్లోకి నెడుతోంది. దీంతో చైనాపై నమ్మకం పోయిందని సూటిగా చెప్పేశారు దోబాల్. ఈ పరిస్థితుల్లో ఇరు దేశాలమధ్య సంబంధాలను ఎలా గడిన పెట్టగలమన్నది ఢిల్లీకి సవాల్ గా మారిందని చెప్పొచ్చు













