US: ట్రంప్-మమ్దానీ.. ఇద్దరూ ఇద్దరే….?
ఓవైపు ఘటనా ఘటన సమర్థుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మరోవైపు తగ్గేదే లేదనే ఘటికుడు న్యూయార్క్ మేయర్ మమ్దానీ.. వీరిద్దరి భేటీ అందరూ ఆశించిన దానికి భిన్నంగా.. అందరినీ ఆశ్చర్యపరిచేలా జరిగింది. అసలు ఈ సమావేశం ఎలా ఉంటుందో అని భావించిన వారందరికీ.. ఈ ఇద్దరు నేతలు షాకిచ్చారు.పరస్పరం ప్రశంసలతో సన్నివేశాన్ని మరింత రక్తి కట్టించారు.ట్రంప్ తన ఎక్స్ ఖాతాలో మమ్దానీతో సమావేశం ఫోటోలను పోస్ట్ చేసి, “న్యూయార్క్ నగర కొత్త మేయర్ జోహ్రాన్ మమ్దానీని కలవడం గొప్ప గౌరవం” అని రాశారు. మరోవైపు, మీడియా సమావేశానికి సంబంధించిన చిన్న వీడియో క్లిప్‌ను మమ్దానీ పోస్ట్ చేశారు.
ఎన్నికలకు ముందు ఈ ఇద్దరూ పరస్పరం తలపడ్డారు. అసలు ట్రంప్ స్వయంగా న్యూయార్క్ మేయర్ గా పోటీ చేశారా అన్న రీతిలో ప్రసంగాలు సాగాయి కూడా. కానీ సమావేశంలో మాత్రం.. ఇద్దరు ఎలాంటి రాజకీయ వాసనలు లేకుండా చూసుకున్నారు.న్యూయార్క్ సిటీలో శ్రామిక ప్రజలు నగర రాజకీయాల్లో కనుమరుగైపోయారు. ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరంలో ప్రతి ఐదుగురిలో ఒకరు 2.9 డాలర్ల రైలు లేదా బస్సు ఛార్జీని కూడా భరించలేకపోతున్నారు.. మన రాజకీయాల్లో వారిని ప్రధానంగా చూడాల్సిన సమయం ఆసన్నమైందని అధ్యక్షుడు ట్రంప్‌తో చెప్పానన్నారు మమ్దానీ.
ఎన్నికల ప్రచారం ఒకరు కమ్యూనిస్ట్ అంటూ విమర్శిస్తే.. మరొకరు ఫాసిస్టంటూ కౌంటరిచ్చారు. సమావేశంలో ఇదే అంశాన్ని లేవనెత్తిన విలేకరులకు.. పరస్పర ప్రశంసలతో బదులిచ్చారు.మా స్థానాలు , అభిప్రాయాల గురించి స్పష్టంగా ఉన్నాం. అసమ్మతులపై కాకుండా ఉమ్మడి లక్ష్యాన్ని సాధించాలన్నదే మా థ్యేయమన్నారు మమ్దానీ..మరోవైపు…మమ్దానీ “మంచి మేయర్ అవుతారు” అన్నారు ట్రంప్. “ఆయన బాగా పని చేస్తారని” తనకు నమ్మకం ఉందన్నారు.
“ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది 85 లక్షల మంది జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మేం ద్రవ్యోల్బణ సవాల్‌ను ఎదుర్కొంటున్నాం, నలుగురిలో ఒకరు పేదరికంలో ఉన్నారు. మా సమావేశంలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఎలా కలిసి పనిచేయవచ్చో చర్చించాం. ద్రవ్యోల్బణం గురించి చింతించే బదులు, నిరాడంబరమైన జీవితాన్ని గడపగలిగే నగరాన్ని వారికి ఎలా అందించగలమనేది చర్చించాం” అని మమ్దానీ అన్నారు.
ట్రంప్, మమ్దానీ ఇద్దరూ న్యూయార్క్ వాసులే. ట్రంప్ చిన్ననాటి ఇల్లు జమైకా ఎస్టేట్స్ పరిసరాల్లో ఉంది. అయితే మమ్దానీ ప్రస్తుతం ఆస్టోరియాలో నివసిస్తున్నారు.ట్రంప్, తాను న్యూయార్క్ నగరాన్ని “ప్రేమిస్తున్నట్లు” మమ్దానీ చెప్పారు.
కానీ, ట్రంప్ పరిపాలన అక్రమ వలసలకు వ్యతిరేకంగా కఠినమైన విధానాలను అమలు చేయడం, వీలైనంత ఎక్కువమందిని బహిష్కరించాలని నిర్దేశించడంతో, దీనిపై ఇద్దరు నాయకులు మరోసారి విభేదించే అవకాశం ఉంది.






