ఎన్సీపీ కట్టప్ప..?
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మరింత తీవ్రరూపు దాల్చింది. పార్టీ పేరు, గుర్తుపై శరద్ పవార్, అజిత్ పవార్.. పోటీ పడుతున్నారు.పార్టీ పేరు, గుర్తు తనదేనని అజిత్‌పవార్ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయిస్తే.. ఆ విషయాన్ని తనకు ఎందుకు తెలియజేయలేదని ప్రశ్నిస్తూ ఈసీకి శరద్ లేఖ రాశారు. దీనిపై ఇప్పటికే కేవియట్ దాఖలు చేసినందున అజిత్‌పవార్ క్లెయిమ్ గురించి తనకు ఈసీ చెప్పి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో సమావేశమైన పార్టీ వర్కింగ్ కమిటీ.. ఫిరాయింపు ఎమ్మెల్యేలైన ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కరే సహా మరో తొమ్మిదిమందిపై బహిష్కరణ వేటు నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది.
మరోవైపు.. ఢిల్లీలోని శరద్ పవార్ నివాసం ఎదుట అజిత్ పవార్ ను కట్టప్పగా .. ద్రోహిగా చిత్రీకరిస్తూ పోస్టర్లు వేశారు. ఈ పోస్టర్లలో పవార్ బాహుబలిగా, కట్టప్పగా అజిత్ పవార్ కనిపిస్తారు. శరద్ పవార్ కు అజిత్ ద్రోహం చేశారని.. ప్రచారం సైతం జరుగుతోంది. ఇదే అంశాన్ని మహారాష్ట్ర ప్రజల్లోకి తీసుకెళ్లాలని శరద్ పవార్ వర్గం భావిస్తోంది. ఎన్నికల్లో ఈఅంశమే ప్రధానాస్త్రం కానున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు కాంగ్రెస్ కూటమి సైతం… బీజేపీ కుట్రారాజకీయాల్ని ప్రజల్లో ఎండగడతామని చెబుతోంది.
అయితే….తమను విలన్ గా చూపడంపై అజిత్ పవార్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019లో శరద్ పవార్ .. బీజేపీతో మాట్లాడమని చెప్పి, తర్వాత గేరు మార్చారన్నారు. తర్వాత కూడా ఓసారి అధిక సీట్లు వచ్చినా, పార్టీ నిర్ణయంతో రూలింగ్ అవకాశాన్ని కోల్పోయామన్నారు. పార్టీకోసం అహర్నిశలు కష్టపడిన తమను.. కట్టప్పలుగా పోల్చడాన్ని అజిత్ పవార్ తప్పుపట్టారు.
మరోవైపు…ఎన్సీపీలో తిరుగుబాటు నేపథ్యంలో శరద్ పవార్ ను కలిసి తమ మద్దతు ప్రకటించారు రాహుల్.ఎన్సీపీలో ఏర్పడిన సంక్షోభాన్ని సొమ్ము చేసుకోబోమని.. శరద్‌పవార్‌కు అండగా నిలుస్తామని తెలిపారు. అంతేకాదు.. తాజా పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నేత పదవిని కూడా క్లెయిం చేయొద్దని, ఎన్సీపీలో సంక్షోభం ముగిసేదాకా ఓపికపట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం మహారాష్ట్రలోని నేతలకు సూచించింది.













