‘క్రిమినల్స్’ పాలిటిక్స్ పై…
భారతదేశ రాజకీయాల్లో మనీ, మజిల్ మైండ్ .. చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా ఇందులోనూ మనీ పవర్, మజిల్ పవర్ దే పైచేయి. ఏ ఎన్నిక చూసినా అంగ, అర్థబలముంటేనే గెలుపు సాధ్యమయ్యే పరిస్థితులున్నాయి. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎన్నికల వేళ.. నడిరోడ్డుపై పార్టీలు ధనప్రవాహాన్ని సాగిస్తాయి. గెలుపే లక్ష్యం.. ఆరోజు వందలకోట్ల పంచేందుకు సిద్ధమవుతాయి. దీంతో జనం కూడా డబ్బిస్తేనే ఓటేస్తానంటున్న పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఇకదీనికి తోడు నేర రాజకీయాలు ఉధృతమయ్యాయి.
భారత పార్లమెంటు అభ్యర్థుల్లో 30శాతం, అసెంబ్లీల అభ్యర్థుల్లో 31శాతం.. క్రిమినల్ కేసులు ఉన్నవారేనని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అందులోనూ హత్యలు, కిడ్నాప్ లు చేసినవారి సంఖ్య అధికంగా ఉంది. వీరికి సీటిస్తే చాలు బెదిరింపులు, కిడ్నాప్ లు .. గెలిచేవరకూ ఆ నియోజకవర్గ ప్రజలు గుండె చేత్తో పట్టుకుని బతకాల్సి వస్తోంది. అలా అని పార్టీలు సైతం వేరేవారికి సీట్లిస్తే గెలిచే పరిస్థితి ఉండదు. దీంతో మనీ,మజిల్ పవర్ ఉన్న క్రిమినల్స్ ను గెలుపే థ్యేయంగా బరిలోకి దించుతున్నాయి పార్టీలు. ఫలితంగా గెలిచిన తర్వాత అధికారాన్ని ఉపయోగించుకుని దోపిడీకి పాల్పడుతున్నారు సదరు సభ్యులు. అంతేకాదు.. అభివృద్ధి సంగతి మరిచి, తమ స్వార్థానికి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
తీవ్రమైన నేరాలకు పాల్పడేవారిపై జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని సుప్రీంకోర్టులో న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ పిల్ దాఖలు చేశారు.దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నేతలపై దాఖలైన కేసుల విచారణకు మార్గదర్శకాలను సూచించింది. ప్రజా ప్రతినిధులపై దాఖలైన క్రిమినల్ కేసులను త్వరిత గతిన విచారించాలని హైకోర్టులకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. తీవ్రమైన నేరం విషయంలో ట్రయల్ కోర్టు విచారణను వాయిదా వేయకూడదని ధర్మాసనం సూచించింది. కేసుల సత్వర పరిష్కారానికి వెబ్సైట్ను సిద్ధం చేయాలని ఆదేశించింది. దోషిగా తేలిన ఎంపీ/ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధంపై ఇంకా విచారణ జరుపుతామని తెలిపింది. ఈ అంశంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది.
ఈ విషయంలో సుప్రీంకోర్టు ఓ చక్కని మార్గదర్శకాలను విడుదల చేయాలని న్యాయవాదులతో పాటు దేశం కోరుకుంటోంది. పార్టీలకు పట్టిన క్రిమినల్ రాజకీయాలను తుడిచిపెట్టేలా చట్టాన్ని రూపొందించాలని కోరుతోంది. ఇలాంటి రూలింగ్ అంటూ ఒకటి వస్తే, కాస్తైనా క్రిమినల్స్ ఒళ్లు దగ్గర పెట్టుకుంటారని ఆశాభావం వ్యక్తమవుతోంది. మరి సుప్రీంకోర్టు ఈ కీలక కేసులో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, దాన్ని కేంద్రం ఎలా అమలుచేయనుందన్నది ఆసక్తికరంగా మారింది.













