STAR LINK: స్టార్ లింక్ టార్గెట్.. రష్యా యాంటీ శాటిలైట్ వెపన్స్ తయారీ..!
మూడు వారాల్లో గెలవాల్సిన యుద్ధం.. మూడేళ్లైనా ముగియడం లేదు. అంతర్జాతీయంగా ఓచిన్నదేశం.. అగ్రరాజ్యాల్లో ఒకటైన రష్యాను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆ ఉక్రెయిన్ యుద్ధ సామర్థ్యం, వ్యూహాత్మక నైపుణ్యం చూసి ముగ్ధులైన పాశ్చాత్య దేశాలు.. ఆయుధాలు అందిస్తూ ఊపిరినిస్తున్నాయి. ఇక అగ్రరాజ్యం అమెరికా అయితే.. ఉక్రెయిన్‌కు వీలైన విధంగా సాయం చేస్తోంది. ఈ యుద్ధంలో ముఖ్యంగా ఉక్రెయిన్ ఆధునిక శాటిలైట్ సాంకేతికత రక్షణ కవచంలా నిలుస్తోంది. దీనికి కారణం ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు సంబంధించిన స్టార్ లింక్ ఉపగ్రహ వ్యవస్థ.
అంతరిక్ష రంగంలో పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని చూస్తోన్న రష్యా.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్టార్‌లింక్’ ఉపగ్రహాలను (Starlink Satellite) లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. కక్ష్యలోనే ఈ ఉపగ్రహాలను పేల్చే విధంగా సరికొత్త యాంటీ-శాటిలైట్ ఆయుధాన్ని (Anti-Satellite Weapon) అభివృద్ధి చేస్తోందని పశ్చిమ దేశాల నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ సందేహాలు నిజమైతే మాత్రం అంతరిక్ష రంగానికి పెను ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నాయి.
ఈ వ్యవహారంపై నాటో, పశ్చిమ దేశాల ఇంటెలిజెన్స్ వర్గాల అధ్యయనాలను ఆధారంగా చేసుకుని అసోసియేటెడ్ ప్రెస్ కథనం రాసింది. దీంతో రష్యా (Russia) యాంటీ-శాటిలైట్ ఆయుధానికి సంబంధించి కీలక విషయాలు బయటికొచ్చాయి. రష్యా అభివృద్ధి చేస్తోన్న ఈ ఆయుధాన్ని ‘జోన్-ఎఫెక్ట్’గా పేర్కొంటున్నారు. అంటే ఒక ఉపగ్రహాన్ని మాత్రమే కాకుండా.. కక్ష్యలోని ఎక్కువ భాగాన్ని లక్ష్యంగా చేసుకోవడమే దీని ఉద్దేశం. ఒకేసారి వేల సంఖ్యలో పెల్లెట్లను కక్ష్యలోకి పంపించి అనేక స్టార్‌లింక్ ఉపగ్రహాలను కూల్చేసే విధంగా దీన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఈ పెల్లెట్లు చాలా చిన్నగా, మిల్లీమీటర్ పరిమాణంలో మాత్రమే ఉంటాయని నిఘా వర్గాలు తమ అధ్యయనంలో పేర్కొన్నాయి. వీటిని భూమ్మీద గానీ.. అంతరిక్షంలో గానీ గుర్తించడం కష్టతరమని తెలిపాయి. వీటిని ట్రాక్ చేసే అవకాశం లేకపోవడంతో ముప్పును ముందే పసిగట్టలేమని అంచనా వేశాయి. అయితే, వీటితో ప్రమాదం మాత్రం తీవ్రంగానే ఉంటుందని హెచ్చరించాయి. ఇలాంటి చిన్న పరిమాణంలో ఉండే శకలం కారణంగా ఇటీవల చైనాకు చెందిన ఓ వ్యోమనౌక దెబ్బతింది. దీంతో భూమ్మీదకు రావాల్సిన ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు.
అంతేకాదు.. ఒకవేళ రష్యా ఈ దాడికి పాల్పడితే కక్ష్యలోని ఇతర వ్యవస్థలకూ ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. దాడి అనంతరం పెల్లెట్లు, ఉపగ్రహ శకలాలు భూమి దిశగా కిందకు జారుతాయి. ప్రస్తుతం ఈ స్టార్‌లింక్ ఉపగ్రహాలు భూమికి 550 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలో ప్రయాణిస్తున్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, చైనా అంతరిక్ష కేంద్రం దీని కంటే తక్కువ ఎత్తులో ఉండే కక్ష్యలో తిరుగుతున్నాయి. ఒకవేళ శకలాలు కిందకు పడే సమయంలో వీటిని ఢీకొనే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే, ఇలాంటి ఆయుధంతో అంతరిక్షంలో తీవ్ర గందరగోళం తలెత్తితే.. అది రష్యాకు కూడా ప్రతికూలంగానే మారుతుందని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రష్యా, దాని మిత్ర దేశం చైనా సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, అనేక కంపెనీలు.. తమ కమ్యూనికేషన్స్, రక్షణ అవసరాల కోసం వేలాది శాటిలైట్లపై ఆధారపడుతున్నాయి.






