పాదయాత్రల సీజన్ వచ్చేసింది..! అధికారం కోసం కాళ్లకు పని చెప్తున్న నేతలు..!
దేశవ్యాప్తంగా పాదయాత్రల సీజన్ నడుస్తోంది. దేశంలో పలువురు నేతలు అధికారమే లక్ష్యంగా పాదయాత్రలకు శ్రీకారం చుట్టారు. పాదయాత్ర చేస్తే కచ్చితంగా అధికారపీఠం దక్కుతుందనే నమ్మకం ఇందుకు ఒక కారణం. 5జీ కాలం నడుస్తోంది ఇప్పుడు. ఏదైనా అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం చాలా ఈజీ. అందరి చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను ప్రజలతో పంచుకునే వీలుంది. అయినా ప్రజలను నేరుగా కలుసుకునేందుకే మొగ్గు చూపుతున్నారు నేతలు. రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిశోర్, నవీన్ పట్నాయక్, షర్మిల.. తదితరులంతా ఇప్పటికే పాదయాత్రలు ప్రారంభించేశారు. త్వరలోనే మరికొంత మంది నేతలు కూడా తమ కాళ్లకు పని చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.
రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ యాత్ర ప్రారంభించారు. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ యాత్ర తమిళనాడు, కేరళను దాటి కర్నాటకలోకి ప్రవేశించింది. సుమారు 3570 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. భారత్ జోడో యాత్ర పేరిట రాహుల్ గాంధీ ఈ యాత్ర కొనసాగిస్తున్నారు. దేశమంతా ఐక్యం కావాలనేది రాహుల్ గాంధీ యాత్ర ప్రధాన ఉద్దేశం. బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఆయన పిలుపునిస్తున్నారు. నాడు గాంధీజీ చేపట్టిన యాత్ర స్ఫూర్తితో రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపట్టినట్టు చెప్తున్నారు.
అక్టోబర్ 2న బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. భువనేశ్వర్ లోని లింగరాజ్ ఆలయం నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. జన సంపర్క్ యాత్ర పేరిట నవీన్ పట్నాయక్ ఈ యాత్రను చేపట్టారు. తన ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా ఈ యాత్ర ప్రారంభించారు నవీన్ పట్నాయక్.
ఇక ప్రశాంత్ కిశోర్ కూడా అక్టోబర్ 2నే పాదయాత్ర ప్రారంభించారు. బీహార్ లోని పశ్చిమ చంపారన్ లో ఉన్న గాంధీ ఆశ్రమం నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. సుమారు 3500 కిలోమీటర్లు సాగే ఈ యాత్ర ద్వారా బీహార్లోని ప్రతి గ్రామాన్నీ సందర్శించాలని పీకే యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్నారు. సుమారు 15 నెలల పాటు ప్రశాంత్ కిశోర్ యాత్ర సాగనుంది.
తెలంగాణలో వైఎస్.ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా పాదయాత్ర చేస్తున్నారు. షర్మిలకు పాదయాత్ర చేయడం కొత్త కాదు. గతంలో తన అన్న జగన్ కోసం ఆమె పాదయాత్ర చేపట్టారు. జగన్ జైలుకు వెళ్లినప్పుడు తన అన్న చేపట్టిన పాదయాత్రను ఆమె కొనసాగించారు. అన్నాచెల్లెళ్ల పాదయాత్ర వైసీపీకి ఎంతో మేలు చేసింది. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు పని చేస్తున్నారు షర్మిల.
పాదయాత్రలు చేయడం రాజకీయ నేతలకు కొత్త కాదు. ఎంతోమంది నేతలు గతంలో పాదయాత్రలు చేప్టటారు. 1983లో జనతాపార్టీ నేత చంద్రశేఖర్ కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకూ పాదయాత్ర చేశారు. జనతా పార్టీ బలపడడానికి ఈ యాత్ర ఎంతో దోహదపడింది. అయితే 1984 ఎన్నికలకు ముందు ఇందిరాగాంధీ హత్యకు గురి కావడంతో యాత్ర తెరవెనక్కు వెళ్లింది. కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.
1990లో ఎల్.కె.అద్వానీ చేపట్టిన రథయాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బీజేపీకి పునాది వేసిన యాత్రగా దీన్ని భావిస్తుంటారు. 1991లో ఏక్తా యాత్ర పేరిట అప్పటి బీజేపీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి కూడా ఒక యాత్ర చేపట్టారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రలకు ప్రత్యేక స్థానం ఉంది. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్, షర్మిల.. తదితరులు పాదయాత్రలు చేపట్టి అధికారంలోకి వచ్చిన వారే. పాదయాత్రలు చేస్తే అధికారపీఠం దక్కడం ఖాయమనే భావన ఉంది. ఇప్పుడు ఇదే ట్రెండ్ ను కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు నేతలు. త్వరలోనే నారా లోకేశ్ కూడా పాదయాత్ర చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మరి చూద్దాం ఈ నేతల అదృష్టం ఎలా ఉందో..!













