జి-20 స్పెషల్…
ఢిల్లీలో జరుగుతున్న జి-20 సదస్సుపై ప్రపంచదేశాల ఫోకస్ ఉంది. అగ్రరాజ్యాధినేతలు స్వయంగా కదిలివస్తుండడంతో.. ఈసదస్సు నిర్వహణపై భారత ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అంతేకాదు భారత మండపం లాంటి అద్భుత నిర్మాణాలు, అరుదైన ఆతిథ్యంతో ఆయాదేశాధినేతలను ఆకట్టుకోనుంది. ఇప్పటికే స్వాగత సత్కారాలు ఎలా ఉంటాయన్న అంశంపై ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఈసందర్భంలో అసలు జి-20 సదస్సు ప్రాధాన్యం ఏమిటన్న విషయాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం..
జి-20 అంటే గ్రూప్ 20 దేశాలని అర్ధం. ప్రపంచీకరణ తరువాత 19 అగ్రరాజ్యాలు, యూరోపియన్ యూనియన్ కలిసి 1999లో ఏర్పాటు చేసుకున్న గ్రూప్ ఇది. ఇందులో అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ సహా అగ్రదేశాలన్నీ ఉన్నాయి. అందుకే ఈ జి-20 గ్రూపునకు ప్రపంచదేశాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తాయి.జీ20ను ఓ విధంగా చెప్పాలంటే మినీ యూఎన్ఓగా చెప్పవచ్చు.
ప్రపంచ జీడీపీలో 85 శాతం, ప్రపంచ జనాభాలో 70 శాతం .. ఈ జి-20 దేశాల నుంచే ఉన్నాయి.ఇందులో ఏకాభిప్రాయంతో తీసుకునే నిర్ణయాలపై ప్రధానంగా ప్రస్తావన ఉంటుంది. 1999లో ఆర్ధిక సంక్షోభం నేపధ్యంలో పరస్పర సహకారం కోసం జీ20 ఏర్పాటైంది. ఆ తరువాత ఎజెండా మారింది. సమగ్రాభివృద్ధి, వాణిజ్యం, వ్యవసాయం, ఆరోగ్యం, ఇంధనం, పర్యావరణం, వాతావరణ మార్పులు, అవినీతి నిరోధక చర్యలు వంటి అంశాల్లో కూడా పరస్పర సహకారం ఉండేలా ఎజెండా సెట్ చేశారు.
జీ 20కు ఓ నిర్దిష్ట కార్యాలయం, హెడ్ క్వార్టర్స్ అంటూ లేవు. ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క దేశానికి సారధ్య బాధ్యతలుంటాయి. ఏ ఏడాది ఏ దేశానికి సారధ్య బాధ్యతలు లభిస్తే ఆ దేశంలో సమ్మిట్ జరుగుతుంది. 2020లో సౌదీ అరేబియా, 2021లో ఇటలీ, 2022లో ఇండోనేషియా జీ 20 సారధ్య బాద్యతలు నిర్వహించగా 2023 బాధ్యతలు ఇండియాకు దక్కాయి. 2022 డిసెంబర్ 1న ప్రారంభమైన ఇండియా సారధ్య బాధ్యతలు 2023 నవంబర్ 30 వరకూ ఉంటాయి. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 9, 10 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది. ఇండియా తరువాత బ్రెజిల్ ఈ బాధ్యతలు తీసుకోనుంది.
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం సాధించడమే ప్రపంచ అత్యధిక జనాభా కలిగి దేశ లక్ష్యంగా మోడీ చాలా సార్లు ప్రస్తావించారు. ఐక్యరాజ్యసమితి 21 శతాబ్దపు వాస్తవాలకు అనుగుణంగా మారాలని, ప్రాముఖ్యత కలిగిన వాయిస్ ఉండాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. మారుతున్న ప్రపంచ భౌగోళిక ఆర్ధిక వాస్తవాల్ని గుర్తించేందుకు సంస్కరణలు తీసుకురావాలని, వాటికి ప్రాతినిధ్యం ఉండాలని చెప్పారు. ఈసదస్సు ద్వారా భారత దేశం బ్రాండ్ ఇమేజ్.. అంతర్జాతీయ దేశాల దృష్టిలో మరింత సమున్నతం కానుందని మోడీ సర్కార్ తలుస్తోంది.













