ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా.. డ్రామా రక్తి కట్టించబోతున్నారా..?
యూపీఎ కూటమిలో కీలక భాగస్వామిగా ఉంది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-ఎన్సీపీ. ఇన్నాళ్లూ బీజేపీని ఎదుర్కొని నిలబడి కాంగ్రెస్ తో కలిసి ప్రయాణం చేశారు ఆ పార్టీ అధినేత శరద్ పవార్. కాంగ్రెస్ – శివసేన – ఎన్సీపీ కలిసి మహారాష్ట్రలో అధికారాన్ని కూడా పంచుకున్నాయి. అయితే ఆ తర్వాత శివసేనను బీజేపీ చీల్చి అధికారాన్ని కైవసం చేసుకుంది. అప్పటి నుంచి ఎన్సీపీలో లుకలుకలు మొదలయ్యాయి. బీజేపీతో కలిసి వెళ్లాలని సోదరుడు అజిత్ పవార్ కోరుకోవడం.., దానికి శరద్ పవార్ అంగీకరించకపోవడంతో రాజకీయం మలుపులు తిరిగింది. అయితే ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతోంది.
ఎన్సీపీ జాతీయాధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేశారు. తాను పదవి నుంచి తప్పుకోబోతున్నట్టు సంచలన ప్రకటన చేశారు. దీంతో పార్టీ శ్రేణులన్నీ ఆశ్చర్యపోయాయి. కొంతమంది నేతలు శరద్ పవార్ ను తప్పుకోవద్దంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలనుకంటున్నట్టు శరద్ పవార్ వెల్లడించారు. అంతేకాక పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగించాలనేదానిపై ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కమిటీనే తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోనుంది.
శివసేన లాగే ఎన్సీపీలో కూడా చీలిక ఖాయమని మహారాష్ట్రలో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అజిత్ పవార్ నేతృత్వంలో పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే అటు అజిత్ పవార్, ఇటు శరద్ పవార్ ఈ వార్తలను కొట్టిపారేస్తూ వచ్చారు. అయితే ఇటీవలికాలంలో శరద్ పవార్ బీజేపీకి మద్దతుగా, మోదీకి అనుకూలంగా కొన్ని స్టేట్ మెంట్లు ఇచ్చారు. దీంతో ఆయన కాంగ్రెస్ కు దూరమవుతున్నారని, బీజేపీకి దగ్గరవుతున్నారని అర్థమైంది. అజిత్ పవార్ నుంచి వస్తున్న ఒత్తిడి మేరకే శరద్ పవార్ ఇలా మాట్లాడుతున్నారని కూడా భావించారు. మరోవైపు 13 మంది ఎమ్మెల్యేలు మినహా మిగిలిన వాళ్లంతా తన మాట వినట్లేదని శరద్ పవార్ చెప్పినట్లు కూడా వార్తలొచ్చాయి.
అయితే శరద్ పవార్ ఇప్పుడు వ్యూహాత్మకంగా ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు అర్థమవుతోంది. అజిత్ పవార్ తన మాట వినే పరిస్థితిలో లేరు. తాను ఔనన్నా కాదన్నా అజిత్ పవార్ బీజేపీకి గూటికి వెళ్లడం ఖాయం. అయితే పార్టీని చీల్చడం మాత్రం శరద్ పవార్ కు ఆందోళన కలిగిస్తోంది. అందుకే తాను ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలుగుతానని పార్టీ నేతలకు చెప్పినట్టు సమాచారం. తదుపరి అధ్యక్షుడు ఎన్నికయ్యాక.. అప్పడు అధికారికంగానే బీజేపీ కూటమిలో ఎన్సీపీ చేరుతుంది. తద్వారా పార్టీ చీలికను అడ్డుకోవచ్చు. అజిత్ పవార్ కోరిక కూడా తీరుతుంది. అందుకు శరద్ పవార్ తన పదవిని ఫణంగా పెట్టారు.













