అజిత్ దే పైచేయి..
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పోరాటంలో శరద్ పవార్ పై అబ్బాయి అజిత్ పవార్ ఆదిపత్యం ప్రదర్శించారు. ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడంలో అజిత్ పవార్ సక్సెసయ్యారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, రెబల్ నేత, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ లు నిర్వహించిన ఎమ్మెల్యేల బల ప్రదర్శనలో అజిత్ వర్గానిదే పైచేయి అయింది. ఆయన ఏర్పాటు చేసిన సమావేశానికి 29మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే, తమకు మొత్తంగా 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అజిత్ పవార్ తెలిపారు. అదే సమయంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సమావేశానికి 14మంది మాత్రమే హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మద్దతుదారులను ఉద్దేశించి అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎం కావాలని ఉందని మనసులో మాట బయటపెట్టశారు..
శరద్ పవార్ మా నేత, గురువు. ఆయనే మా దేవుడు. అందులో మరో ప్రశ్నే లేదు. ఆయన ఆశీర్వాదాలు ఆశిస్తున్నాం. 2004లో కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు వచ్చాయ్. ముఖ్యమంత్రి పదవి వరించే అవకాశం ఎన్సీపీకి వచ్చినప్పటికీ అప్పుడు వదిలేశాం. రాష్ట్ర సంక్షేమం కోసం కొన్ని ప్రణాళికలు నా దగ్గర ఉన్నాయి. నాకు ముఖ్యమంత్రి కావాలని ఉంది. భాజపాలో నేతలు 75ఏళ్లకే పదవీవిరమణ తీసుకుంటారు . రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీ స్థాపించాం. రాష్ట్రానికి ఓ బలమైన నేత కావాలి. శరద్ పవారే మాకు స్ఫూర్తి’ అని అజిత్ పవార్ తెలిపారు.
2019 సంక్షోభానికి సంబంధించి అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేనతో పొత్తుకు ముందు బీజేపీతో ఎన్సీపీ 5సార్లు సమావేశాలు జరిపిందని అన్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ.. బీజేపీతో పొత్తు లేదు శివసేనతో కలిసి వెళ్తున్నామని నాకు చెప్పారు. గతేడాది శివసేనలో ఏక్నాథ్ శిండే తిరుగుబాటు చేసినప్పుడు.. బీజేపీతో చేతులు కలపాలని ఎన్సీపీలోని ఎమ్మెల్యేలంతా కోరుకున్నారు. అందరి సంతకాలు కూడా సేకరించాం. మా అభిప్రాయాలను అంగీకరించాలని శరద్ పవార్‌ను కోరాం. ఇందుకోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశాం. అప్పుడు కూడా శరద్ పవార్ అంగీకరించినట్లే కన్పించారు. బీజేపీనేతలతో ఫోన్లో మాట్లాడమని చెప్పారు. కానీ మళ్లీ వెనుకంజ వేశారు. ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన కాపీలు నా దగ్గర ఉన్నాయి. కానీ ఇప్పుడు నన్ను విలన్‌గా చేస్తున్నారన్నారు అజిత్ పవార్.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వయస్సు గురించి తన సోదరుడు అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలకు సుప్రియా సూలే కౌంటర్ ఇచ్చారు. పెద్ద వయస్సువారు కేవలం ఆశీర్వదించడానికేనని ఎలా భావిస్తారని ప్రశ్నించారు. శరద్ పవార్ ను ఉద్దేశించి అగౌరవంగా మాట్లాడితే తట్టుకోలేమన్నారు. అత్యంత అవినీతిమయమైన బీజేపీతో పోరాటం కొనసాగిస్తామన్నారు.పవార్ సాహెబ్ కంటే రతన్ టాటా మూడేళ్లు పెద్దవారు. కానీ టాటా సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ వయస్సు 82. ఆయన ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. అసలైన ఎన్సీపీ శరద్ పవార్‌తోనే ఉంది. పార్టీ గుర్తు మనతోనే ఉంది’ అంటూ బదులిచ్చారు.
మరోవైపు..ఎన్సీపీలో వర్గ పోరు ఎన్నికల సంఘం వద్దకు చేరింది. పార్టీలో తమకు అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతున్న అజిత్ పవార్ వర్గం ఈసీని ఆశ్రయించింది. వారికి మద్దతుగా ఉన్న 40 మంది ఎమ్మెల్యేలు, ఎంపీల అఫిడవిట్లను ఈసీకి సమర్పించింది. పార్టీ పేరుతో పాటు ఎన్నికల గుర్తును తమ వర్గానికి కేటాయించాలని అజిత్ వర్గం ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించింది.













