ఇండియా కూటమి లక్ష్యం నెరవేరేనా?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా తలపడి బీజేపీ కొమ్ములు వంచుదామని భావించిన విపక్షాలకు కాంగ్రెస్ గట్టి షాకే ఇచ్చింది. కూటమి అన్నది రాష్ట్రాల్లో పోటీకి సంబంధించినది కాదని.. ఇది కేవలం లోక్ సభ ఎన్నికలకు సంబంధించిందని తేల్చిచెప్పింది. మోడీ సర్కార్ పై పోరాటంలో భాగంగా కూటమి ఏర్పడిందని స్పష్టత ఇచ్చింది. ఇటీవలే మధ్యప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి.. కూటమి పోరాటం లేకపోవడంపై మిగిలిన పక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. దీనిలో భాగంగా ఎస్పీ సహా పలు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా నిమగ్నమైన కాంగ్రెస్ పార్టీ… ఇండియా కూటమిపై దృష్టి సారించడం లేదని బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆరోపించారు. గురువారం సీపీఐ ఆధ్వర్యంలో పట్నాలో నిర్వహించిన ‘బీజేపీ హఠావో, దేశ్ బచావో’ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. 2024 లోక్‌సభ ఎన్నికల సీట్ల పంపకాలపై కాంగ్రె్‌సతో చర్చలు జరుపుతున్నామని, అయితే ప్రస్తుతం ఎన్నికలు ప్రకటించిన రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించడంలో కాంగ్రెస్ బిజీగా ఉందన్నారు. విపక్షాల కూటమి నిన్న మొన్నటి వరకూ కనబరిచిన దూకుడును కొనసాగించలేకపోవడానికి ఇదీ ఒక కారణమన్నారు. ‘‘రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్న వారిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలన్నీ కలసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. కానీ ఇటీవలి కాలంలో ఈ విషయంలో పెద్దగా పురోగతి లేదు. కూటమిలో కాంగ్రెస్ ముందుండి నడిపించేందుకు మేమం అంగీకరించాం. కానీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతే వారు తదుపరి సమావేశానికి పిలుస్తారనిపిస్తోంది’’ అన్నారు.
నితీశ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. రాష్ట్రాల ఎన్నికల ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ… ఈ ఎన్నికలను తాము సీరియస్ గా ఎదుర్కొంటామని స్పష్టం చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ఏర్పడిందని, ఇది రాష్ట్రాలకు సంబంధించిన విషయం కాదని పేర్కొంది. మోదీ ప్రభుత్వాన్ని వీలైనంత త్వరగా గద్దె దించాలన్నదే నితీశ్ ఉద్దేశమని, ఎన్నికల సమయం వచ్చినప్పుడు అది తప్పకుండా జరుగుతుందని పేర్కొంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరితో ఒకరు పోటీ పడుతూ లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోరాడతామని కాంగ్రస్ పలు పార్టీల అధినేతలు చెబుతున్నారు. కానీ దీనికి కొన్ని పక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో పరస్పరం తలపడిన పక్షాలు .. లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామంటే.. కింది స్థాయి క్యాడర్ అంగీకరిస్తుందా? ప్రచారాన్ని మనస్ఫూర్తిగా నిర్వహిస్తుందా అంటే లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో కూటమి పోరాటం సార్వత్రిక ఎన్నికల్లో ఎంతవరకూ లక్ష్యాన్ని సాధిస్తుందన్నది అనుమానంగా మారుతోంది.













