ఒకే వేదిక పంచుకోనున్న శరద్ పవార్, అజిత్ పవార్..! రాజీ కుదిరినట్లేనా..?
మహారాష్ట్రలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఎన్సీపీలో చీలిక వ్యవహారం అంతుచిక్కట్లేదు. అసలు ఏం జరుగుతోందో.. ఎవరు నిజమో.. ఎవరు అబద్దమో అస్సలు అర్థం కావట్లేదు. పైకి మాత్రం ఎవరికి వారే నిజాయితీపరులుగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ లోపల మాత్రం ఏదో జరుగుతోందనే అనుమానాలు మొదటి నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు బాబాయ్ – అబ్బాయ్ ఇద్దరూ కలిసి ఒకే వేదికపై కనిపించనుండడం మరింత ఆసక్తి రేపుతోంది. అది కూడా ప్రధాని మోదీతో..! దీంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
ఆగస్టు ఒకటిన పూణెలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిష్టాత్మకమైన లోకమాన్య బాలగంగాధర తిలక్ జాతీయ పురస్కారాన్ని తిలక్ స్మారక మందిర ట్రస్ట్ అందించనుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ రమేశ్ బియాస్, ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, ఉపముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడణవీస్, అజిత్ పవార్ హాజరుకానున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది తిలక్ ట్రస్ట్. దీంతో ఆయన కూడా హాజరుకానున్నారు. ప్రధాని మోదీతోపాటు అజిత్ పవార్ తో కలిసి శరద్ పవార్ వేదికను పంచుకోనున్నారు. ఇది ఇప్పుడు మహారాష్ట్రలో ఆసక్తికరంగా మారింది.
ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ వేరుకుంపటి పెట్టుకున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెంట ఉన్నారు. తనదే అసలైన ఎన్సీపీ అని అజిత్ పవార్ చెప్తున్నారు. అయితే తానుండగా ఎన్సీపీని అలా జరగనివ్వబోనని శరద్ పవార్ చెప్తున్నారు. అజిత్ పవార్ సహా ఆయన వెంట ఉన్నవాళ్లందరినీ పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే తనదే ఒరిజినల్ ఎన్సీపీ అని.. ఆ మేరకు గుర్తింపు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరారు అజిత్ పవార్. వీళ్లిద్దరి మధ్య పార్టీకోసం ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బాబాయ్, అబ్బాయ్ ఇద్దరూ ఒకే వేదికను పంచుకోనుండడం ఇంట్రస్టింగ్ పరిణామం.
మరోవైపు.. ప్రధాని మోదీ ఇంతకాలం ఎన్సీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ పార్టీ నేతలంతా అవినీతి పరులని ఆరోపించారు. ఇప్పుడు అదే ఎన్సీపీకి చెందిన నేతలను బీజేపీ ప్రభుత్వంలో చేర్చుకోవడంతో శరద్ పవార్ కు అస్త్రం దొరికినట్లయింది. ఇప్పుడు బీజేపీ తన నేతలను ప్రభుత్వంలో చేర్చుకోవడంతో ఇన్నాళ్లూ మోదీ చేసిన అవినీతి ఆరోపణలన్నీ అవాస్తవాలని తేలిపోయిందని శరద్ పవార్ అంటున్నారు. అయితే శరద్ పవార్, అజిత్ పవార్ ఇద్దరూ తోడుదొంగలేనని, వాళ్లిద్దరూ కలిసే ఆడుతున్న నాటకమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మోదీ సమక్షంలో ఇద్దరు నేతల సమావేశం ద్వారా అటు బీజేపీ, ఇటు ఎన్సీపీ ఇద్దరూ ఒక్కటేననే విషయం మరోసారి రుజువైందని చెప్తున్నారు.













