Afg-Pak: ఆఫ్గన్, పాక్ మధ్య యుద్ధం మరింత తీవ్రం.. ఆస్పత్రిపై వైమానిక దాడిలో 400 మంది మృతి
ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్ మధ్య యుద్ధం మరింత ముదురుతోంది. కాబుల్ లోని ఓ ఆస్పత్రిపై దాయాది పాకిస్తాన్ అమానుష చర్యకు దిగింది. కాబూల్ ఆస్పత్రిపై ఈ నెల 16 అర్ధరాత్రి వైమానిక దాడికి దిగింది. దీంతో 400 మంది మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు కూడా. ఈ దాడులతో ఇరు దేశాల మధ్య యుద్ధం తార స్థాయికి చేరిందని చెప్పవచ్చు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారికి చికిత్స అందిస్తున్న కాబూల్ లోని ఓ ఆస్పత్రిపై పాక్ వైమానిక దాడులకు దిగింది. దాడి కారణంగా ఆస్పత్రి భవనం పూర్తిగా ధ్వంసమైపోయింది. ఈ ఆస్పత్రి 2000 పడకల ఆస్పత్రి. సుమారు ఈ దాడిలో 250 మంది గాయపడ్డారు.
మరోవైపు ఈ దాడిని భారత్ సర్కారు తీవ్రంగా ఖండించింది. ఇదో పిరికిపంద చర్య అని, అమానుషమైన దాడి అని పేర్కొంది.ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది.
ఇవి కూడా చదవండి
‘పాకిస్థాన్ జరిపిన వాయుదాడిని భారత్ నిర్ద్వంద్వంగా ఖండిస్తోంది. ఇది పిరికిపంద చర్య. దుర్మార్గమైన హింసాత్మక చర్య. పెద్ద సంఖ్యలో పౌరులు మరణించారు. ఈ మారణహోమాన్ని సైనిక ఆపరేషన్‌గా కప్పిపుచ్చుకునేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నం ఎంతమాత్రం సమర్ధనీయం కాదు. ఇది అఫ్గాన్ సార్వభౌమాధికారంపై జరిగిన దాడి. ఇలాంటి చర్యల వల్ల ప్రాంతీయ అస్థిరతకు ముప్పు వాటిల్లుతుంది. దేశ అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సరిహద్దుకు ఆవల దాడులకు దిగడం పాకిస్థాన్ బాధ్యతారాహిత్యాన్ని, నిర్లక్ష్యాన్ని చాటుతుంది’ అని విదేశాంగ శాఖ తెలిపింది.
పవిత్ర రంజాన్ మాసంలో ఈ దాడులకు పాల్పడటం మరింత దారుణమని, నమ్మకాలు, చట్టాలు, నైతికత లేకుండా ఆసుపత్రులు, పేషెంట్లపై దాడి చేశారని విమర్శించింది. ఇలాంటి దాడులకు పాల్పడేవారిని అంతర్జాతీయ సమాజం జవాబుదారీగా చేయాలని భారత్ సూచించింది. మృతులు, వారి కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నామని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని పేర్కొంది. ఈ విషాద సమయంలో అఫ్గాన్ ప్రజలకు సంఘీభావం తెలియజేస్తున్నామని, అఫ్గాన్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని విదేశాంగ శాఖ ప్రకటించింది.
పాక్.. ఆఫ్గన్ మధ్య యుద్ధంలో అమాయక ప్రజలు బలైపోతున్నారు. ఇరు దేశాల మధ్య వైరం పెరిగిపోయింది. తమ జనావాసాలపై పాక్ మోర్టార్లతో దాడి జరుగుతోందని తాలిబాన్ ప్రభుత్వం పేర్కొంది. ఇక.. మీకూ మాకూ యుద్ధమేనని పాక్ రక్షణ మంత్రి ప్రకటించిన తర్వాత మరింత ముదిరింది.తాలిబన్లు పాక్ సైనికులను హతమార్చిన నేపథ్యంలో శుక్రవారం పాక్ ప్రతీకారానికి దిగింది. ఘజబ్ లిల్ హక్ పేరిట ఈ మిలిటరీ ఆపరేషన్‌కు తెరతీసింది.








