నితీష్ జెండా పీకేశారా..?
సార్వత్రిక ఎన్నికల వేళ విపక్ష కూటమికి వరుసదెబ్బలు తగులుతున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు నేతలు .. గుడ్‌బై చెప్పారు. ఇప్పుడు ముచ్చటగా మూడో నేత సైతం కూటమికి గుడ్ బై చెప్పనున్నారని సమాచారం. బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ లోక్‌సభ ఎన్నికల ముందు యూ-టర్న్ తీసుకొని బీజేపీతో జట్టు కట్టనున్నారని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి థాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న’ అవార్డును ప్రదానం చేయాలని నిర్ణయించిన సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీకి నితీష్ కుమార్ ధన్యవాదాలు తెలిపిన మరుసటి రోజే ఈ వార్తలు తెరపైకి వచ్చాయి. ఆసమయంలోనే కాంగ్రెస్ తీరుపై పరోక్ష విమర్శలు చేశారు నితీష్. తాను ఎన్నోమార్లు కర్పూరి థాకూర్‌కు భారత రత్న ఇవ్వాలని ప్రతిపాదించినా.. కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు.
కాంగ్రెస్ వైఖరితో తీవ్ర అసంతృప్తిగా ఉన్న మిత్రపక్షాలు.. దేనిదారి అది చూసుకుంటున్నాయి. లోక్‌సభ స్థానాల్లో ఎవరికి బలమున్న చోట , వారి నాయకత్వంలో పోటీ చేద్దామన్న ప్రతిపాదనకు కాంగ్రెస్ తిలోదకాలివ్వడంతో.. విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఈమాత్రం దానికి కూటమి ఎందుకన్న భావనలో ఉన్న విపక్షాలు… తమ ప్రభావం అధికంగా ఉన్న చోట, తామే పోటీ చేస్తామంటున్నాయి. కాంగ్రెస్ తీరు.. తమకు ఆమోదయోగ్యం కాదని తేల్చి చెబుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు కీలక నేతలు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పాయి. నితీష్ కుమార్ కూడా దూరమైతే కూటమికి భారీ ఎదురుదెబ్బని చెప్పక తప్పదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కాగా కూటమిని మార్చడం నితీశ్ కుమార్‌కు పరిపాటిగా మారింది. ఈసారి కూటమి మారితే ఐదవసారి కానుంది. 2013లో ఎన్డీఏ, మహాఘట్బంధన్ కూటముల మధ్య ఆయన ఊగిసలాడారు. అయితే సీఎం పదవిని ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చూసుకుంటున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో పాల్గొనాలంటూ హస్తం పార్టీ పంపిన ఆహ్వానానికి కూడా ఆయన స్పందించలేదంటూ వార్తలు వస్తున్నాయి. ఇండియా కూటమి ఎన్నికల సన్నాహాల్లో స్పష్టత లేకపోవడం, ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆమోదం లేకపోవడంతో నితీశ్ కుమార్ కలత చెందినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాల చర్చల్లో జాప్యం కూడా ఇందుకు కారణంగా విశ్లేషించాయి.













