నోరుజారి.. సారీ చెప్పి..!
దేశంలోని సీనియర్ నేతల్లో ఒకరు.. అంతేనా ఇండియా అలయెన్స్ సారథుల్లో ఒకరు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్న నేత. ప్రధాని మోడీకి ధీటైన నేతగా రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట.అంతే కాదు ఇండియా కూటమి తరపున ప్రధాని అభ్యర్థుల్లో ఈయన పేరు కూడా వినిపిస్తోంది. అంతే కాదు.. ఈ అగ్రనేతను తమవైపు తిప్పుకునేందుకు .. బీజేపీ చేయని ప్రయత్నం లేదు. ఆయనే బిహార్ సీఎం నితీశ్ కుమార్.
అలాంటి సీనియర్ నేత పొరపాటున నోరు జారారు. అసెంబ్లీలో జనాభా నియంత్రణ గురించి మాట్లాడుతూ.. చదువుకున్న అమ్మాయిలకు కుటుంబ నియంత్రణ ఎలా చేయాలో తెలుస్తుందన్నారు. అదే చదువుకోని అమ్మాయిలైతే, భర్తలు చెప్పినట్లు నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. ఆయన యధాలాపంగా అన్నా కూడా.. అది వివాదాస్పదమైంది. అసెంబ్లీ సెషన్స్ లో విపక్ష బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అంతేనా నితీశ్ కుమార్ రాజీనామాకు బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు.
జరిగిన తప్పిదాన్ని గుర్తించిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలతో ఏదైనా తప్పుడు సందేశం వెళ్లినట్లయితే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటానని చెప్పారు. అంతేకాదు.. ఇప్పటికే తాను పలుమార్లు క్షమాపణలు చెప్పానని… ఇక ఆవిషయాన్ని వదిలిపెట్టి, సమస్యలపై ఫోకస్ పెట్టాలని విపక్షనేతలకు సూచించారు. అయితే బీజేపీ నేతలు మాత్రం .. అస్సలు తగ్గడం లేదు. మరోవైపు.. నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను జేడీయూ మిత్రపక్షమైన ఆర్జేడీ సమర్థించింది. అయితే నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించకూడదని బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కోరారు.ఈ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ సైతం తీవ్ర విమర్శలు చేశారు.మహిళలపై నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రేఖా శర్మ తీవ్రంగా ఖండించారు. మహిళల హక్కులు, వారు ఏం చేయాలి అనే విషయంలో నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయని పేర్కొన్నారు. వెంటనే బిహార్ సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు… ప్రధాని మోడీ సైతం.. నితీశ్ కుమార్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఎంత దిగజారిపోతారని ప్రశ్నించారు. నితీశ్ వ్యాఖ్యల్ని .. ఇండియా కూటమిలోని ఏ ఒక్కనేత ఖండించలేదన్నారు. మహిళలపట్ల ఇలాంటి నీచమైన ఆలోచనలున్న వారు.. వారి సంక్షేమంకోసం ఏం జాగ్రత్తలు తీసుకుంటారన్నారు మోడీ.
ఇటీవల బిహార్లో కులగణనను నిర్వహించిన నితీశ్ కుమార్ ప్రభుత్వం.. ఆ కులగణన నివేదికను అసెంబ్లీలో మంగళవారం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఆ నివేదికపై సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా బిహార్లో చదువుకున్న మహిళలు శృంగారంలో తమ భర్తలను నియంత్రించగలరని.. వారికి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు అంటూ వ్యాఖ్యానించారు. పెళ్లి అయిన తర్వాత భర్తలు చేసే చర్యల వల్ల జననాలు పెరుగుతున్నాయని.. అయితే బిహార్లో చదువుకున్న మహిళలు తమ భర్తను అడ్డుకుంటున్నారని.. ఫలితంగా ప్రస్తుతం బిహార్లో జననాల రేటు తగ్గుతూ వస్తోందని వ్యాఖ్యానించారు.













