మృత్యుభూమి..
భారీ భూకంపం.. మొరాకోను అతలాకుతలం చేసింది. శుక్రవారం రాత్రి 11.11 గంటలకు 6.8 తీవ్రతతో వచ్చిన భూకంపానికి వేలాది మంది బలయ్యారు. ఇంకా ఎంతమంది శిథిలాల కింద ఉన్నారో తెలియదు. ఓవైపు సహాయక బృందాల అన్వేషణ కొనసాగుతోంది. ఇక ఆప్రాంతంలో తమవారి ఆచూకీ కోసం బాధితుల బంధువులు వెతుకుతున్న తీరు హృదయాన్ని కలచివేస్తోంది.
మొరాకో భూకంప మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కూలిన నిర్మాణాల శకలాలను వెలికి తీసేకొద్దీ వందల సంఖ్యలో మృతదేహాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సైన్యం రంగంలోకి దిగింది. భూకంప కేంద్రమైన హై అట్లాస్ పర్వత ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో నష్టం అంచనా వేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో శిథిలాల కింద భారీగా మృత దేహాలను సహాయక సిబ్బంది వెలికితీస్తున్నారు. మృతుల్లో విదేశీయులూ ఉన్నారు. అయితే భారతీయులెవరూ గాయపడలేదని మొరాకోలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
మరోవైపు….అక్కడి మట్టిరోడ్లపై బండరాళ్లు పడిపోవడంతో టాక్సీలు, అంబులెన్సులు, రెడ్ క్రాస్ సిబ్బంది వాహనాలు ముందుకు వెళ్లడం కష్టంగా మారింది. దీంతో సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. అక్కడ జరిగిన నష్టం వివరాలు కూడా వెల్లడైతే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు. అమెరికా, ఇజ్రాయెల్, అల్జీరియా, జర్మనీ, యూఏఈ, జోర్డాన్ తదితర దేశాలతోపాటు డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ వంటి సంస్థలు చేయూత అందిస్తున్నాయి.
చారిత్రక పట్టణం మారకేష్ సహా చుట్టుపక్కల అయిదు ప్రావిన్సుల పరిధిలో ఈ భూకంపం విధ్వంసం సృష్టించింది. అట్లాస్ పర్వతాల్లో ఉన్న పర్యాటక ప్రాంతం మౌలే బ్రహీం భూకంపం ధాటికి విలవిల్లాడింది. మూడువేల జనాభా కలిగిన ఈ చిన్న పట్టణవాసుల ప్రధాన ఆధారం వ్యవసాయం, పర్యాటకం. ఇక్కడి వందల ఏళ్లనాటి ఇటుకతో నిర్మించిన ఇళ్లు పర్యాటకులను ఆకట్టుకునేవి. భూకంపం తీవ్రతకు ఈ ఇళ్లు చాలా వరకు నామరూపాలు కోల్పోగా మిగిలినవి పాక్షికంగా ధ్వంసమయ్యాయి.
భారీ భూకంపంతో దేశవ్యాప్తంగా విషాద వాతావరణం నెలకొంది. మూడు రోజులపాటు సంతాపదినాలుగా ప్రకటిస్తూ కింగ్ మహమ్మద్-6 నిర్ణయం తీసుకొన్నారు.వరుసగా రెండో రోజు కూడా ప్రజలు అర్ధరాత్రి వీధుల్లోనే గడిపారు. మళ్లీ ఎక్కడ భూకంపం వస్తుందో అన్న భయం వారిలో కనిపిస్తోంది.













